ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయండి 

Telangana Minister Harish Rao Review Meet On Job Recruitment - Sakshi

నియామక సంస్థలకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం 

అనుమతులు ఇచ్చినా కొన్ని నోటిఫికేషన్లు వెలువడక పోవడంపై అసంతృప్తి 

ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నియామక సంస్థలను ఆదేశించారు. దాదాపు 80 వేల ఉ ద్యోగ ఖాళీలను నోటి ఫై చేసిన ప్రభుత్వం ఇప్పటికే సగానికిపైగా కొలువులను భర్తీ చేసేందుకు అనుమతులు సైతం ఇచ్చిందన్నారు.

ఈ ప్రక్రియ పూర్తయి నెలలు కావస్తున్నా కేవలం పోలీసు, ఇంజనీరింగ్‌ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రమే వెలువడ్డాయంటూ, ఇతర ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, నియామక సంస్థలైన టీఎస్‌పీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, గురుకుల నియామకాల బోర్డులతో పాటు నియామకాలకు సంబంధించిన శాఖలతో హరీశ్‌ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.  

నోటిఫికేషన్ల జారీలో ఆలస్యమెందుకు? 
ఉద్యోగాల భర్తీపై ఆర్థిక శాఖ రూపొందించిన నోట్‌ ఆధారంగా మంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన ఉద్యోగాలు, వెలువడిన ప్రకటనలను నిశితంగా పరిశీలించారు. కొన్నిటికి అనుమతులు ఇచ్చినా ప్రకటనలు వెలువడకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

గురుకుల ఉద్యోగాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉందని చెబుతూ.. అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పటికీ జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల అంశాలను పరిశీలించుకుని నోటిఫికేషన్లు ఇవ్వాలని, సమస్యలు ఎదురైతే ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు. సర్వీసు నిబంధనలు, నూతన జోనల్‌ విధానంలో సందేహాలుంటే ప్రభుత్వానికి నివేదిస్తే వేగంగా వివరణ వస్తుందని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top