నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం

Telangana Lockdown Mother Razia Begum Worried About Son Struck Ukraine - Sakshi

‘‘ఉక్రెయిన్‌ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్‌ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్‌ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్‌ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్‌. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్‌ ఫేమస్‌ అయ్యారు.  

సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో  నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్‌ అమన్‌ను తీసుకొచ్చుకునేందుకు బోధన్‌ ఎస్పీ నుంచి పర్మిషన్‌ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. 

సాలంపాడ్‌ క్యాంప్‌ విలేజ్‌లో గవర్నమెంట్‌ టీచర్‌గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్‌ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్‌ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం.  

రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్‌ సుమీ స్టేట్‌ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్‌. ఉక్రెయిన్‌ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్‌లో అతను ఆశ్రయం పొందుతున్నాడు.

అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్‌ కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top