రాష్ట్ర రోడ్లకు కేంద్రం ఊతం | Telangana Highways Double Decker Corridor Approval | Sakshi
Sakshi News home page

రాష్ట్ర రోడ్లకు కేంద్రం ఊతం

Oct 14 2026 5:23 AM | Updated on Oct 14 2026 5:23 AM

Telangana Highways Double Decker Corridor Approval

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

3 కొత్త ఆర్‌వోబీలు, ‘పర్వతమాల’ద్వారా 5 రోప్‌వేలకు ఆమోదం

హైదరాబాద్‌–శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌పై డీపీఆర్‌ తయారీకి ఆదేశం

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి భేటీ

కృష్ణా నదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి శంకుస్థాపనకు సమ్మతి.. ‘ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌’కు గడ్కరీకి ఆహ్వానం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణలో కీలక మౌలిక వసతుల కల్పన, జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊతం లభించింది. రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు పెండింగ్‌ ప్రాజెక్టులు, ఎలివేటెడ్‌ కారిడార్లు, కొత్త రహదారుల నిర్మాణాలపై చర్చించారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన కీలక ప్రతిపాదనలకు గడ్కరీ తక్షణ ఆమోదం తెలపడంతోపాటు మరికొన్నింటిపై సానుకూలంగా స్పందించారు.

హైవే పనుల్లో వేగం...
హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతోపాటు ఎన్‌హెచ్‌–65 పరిధిలోని హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం రహదారి విస్తరణ పనులను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేశారు. హైదరాబాద్‌–శ్రీశైలం (ఎన్‌హెచ్‌–765) మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలన్న విజ్ఞప్తిపై స్పందిస్తూ తక్షణమే కొత్త డీపీఆర్‌ సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.

కృష్ణా నదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి, 5 రోప్‌వేలు...
ఎన్‌హెచ్‌–167కె పరిధిలో కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి శంకుస్థాపన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, ఏపీ మధ్య రవాణా వ్యవస్థ సులభతరం అవుతుంది. పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందనుంది. పర్వతమాల పథకం కింద తెలంగాణలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాతి్మక ప్రాంతాలకు ఉపయోగపడేలా 5 రోప్‌వేల నిర్మాణానికి గడ్కరీ ఆమోదముద్ర వేశారు.

అలాగే కేంద్ర రోడ్డు మౌలిక వసతుల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) పరిధిలోని సేతు బంధన్‌ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జీల (ఆర్‌వోబీల) నిర్మాణానికి ఆమోదం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం బైపాస్‌ రోడ్డుపై 4 లేన్ల ఆర్‌వోబీ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ వద్ద రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ స్థానంలో 2 లేన్ల ఆర్‌వోబీ, నల్లగొండ జిల్లా దామరచర్ల–వీరలపాలెం రోడ్డుపై 4 లేన్ల ఆర్‌వోబీ సాకారం కానున్నాయి.

రాష్ట్ర హైవేలకు జాతీయ హోదా... 
తెలంగాణలో కీలక అంతర్గత మార్గమైన పుల్లూరు–అలంపూర్‌–జట్రపోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్‌–లింగాల–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్లగొండ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్‌ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల పరిధిలోని మరో 34 పనులకు సీఆర్‌ఐఎఫ్‌ నిధులను త్వరగా విడుదల చేయాలని కోమటిరెడ్డి కోరగా వాటిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. కాగా, నవంబర్‌ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేయాలని గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానించగా తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఓట్లపై కాంగ్రెస్‌ ఫోకస్‌.. బూత్‌ స్థాయిలో స్పెషల్‌ ప్లాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement