breaking news
Telangana highways
-
రాష్ట్ర రోడ్లకు కేంద్రం ఊతం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణలో కీలక మౌలిక వసతుల కల్పన, జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊతం లభించింది. రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త రహదారుల నిర్మాణాలపై చర్చించారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన కీలక ప్రతిపాదనలకు గడ్కరీ తక్షణ ఆమోదం తెలపడంతోపాటు మరికొన్నింటిపై సానుకూలంగా స్పందించారు.హైవే పనుల్లో వేగం...హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు ఎన్‌హెచ్–65 పరిధిలోని హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం రహదారి విస్తరణ పనులను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేశారు. హైదరాబాద్–శ్రీశైలం (ఎన్‌హెచ్–765) మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న విజ్ఞప్తిపై స్పందిస్తూ తక్షణమే కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి, 5 రోప్‌వేలు...ఎన్‌హెచ్–167కె పరిధిలో కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, ఏపీ మధ్య రవాణా వ్యవస్థ సులభతరం అవుతుంది. పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందనుంది. పర్వతమాల పథకం కింద తెలంగాణలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాతి్మక ప్రాంతాలకు ఉపయోగపడేలా 5 రోప్‌వేల నిర్మాణానికి గడ్కరీ ఆమోదముద్ర వేశారు.అలాగే కేంద్ర రోడ్డు మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) పరిధిలోని సేతు బంధన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జీల (ఆర్వోబీల) నిర్మాణానికి ఆమోదం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం బైపాస్ రోడ్డుపై 4 లేన్ల ఆర్వోబీ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్ స్థానంలో 2 లేన్ల ఆర్వోబీ, నల్లగొండ జిల్లా దామరచర్ల–వీరలపాలెం రోడ్డుపై 4 లేన్ల ఆర్వోబీ సాకారం కానున్నాయి.రాష్ట్ర హైవేలకు జాతీయ హోదా... తెలంగాణలో కీలక అంతర్గత మార్గమైన పుల్లూరు–అలంపూర్–జట్రపోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్లగొండ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల పరిధిలోని మరో 34 పనులకు సీఆర్ఐఎఫ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోమటిరెడ్డి కోరగా వాటిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. కాగా, నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేయాలని గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానించగా తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్.. బూత్ స్థాయిలో స్పెషల్ ప్లాన్! -
రోడ్ల పనులకు టెండర్లు
* కేంద్ర ప్రభుత్వ రేట్ల అమలు నిర్ణయంతో లైన్‌క్లియర్ * 10 వేల కిలోమీటర్ల మేర అభివృద్ధికి టెండర్లు పిలిచిన అధికారులు * దాదాపు రూ. 10 వేల కోట్లు కేటాయించిన తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రహదారులకు కొత్త రూపునిచ్చే బృహత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలను కూడా అనుసంధానిస్తూ రెండు లేన్ల రోడ్ల నిర్మాణంతోపాటు 10 వేల కిలోమీటర్ల పాత రోడ్లకు పూర్తిస్థాయిలో కొత్త రూపునిచ్చే దిశగా చర్యలు మొదలుపెట్టారు. ఇందుకోసం దాదాపు రూ. 10 వేల కోట్ల మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. పురపాలక సంఘాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలతో పోలిస్తే రోడ్లు భవ నాల శాఖ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్ఎస్ఆర్) తక్కువగా ఉండటంతో టెండర్లకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపేవారు కాదు. కానీ అన్ని విభాగాల ఎస్‌ఎస్‌ఆర్‌లు ఒకేరకంగా ఉండేలా ఇంజనీరింగ్ విభాగాలన్నీ కేంద్ర ప్రభుత్వ రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ స్టాండర్ట్ డేటాను అనుసరించాలంటూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రోడ్ల టెండర్లకు లైన్ క్లియరైంది. దీంతో ముందుగా పది వేల కిలోమీటర్ల ప్రస్తుత రహదారులను అభివ ృద్ధి చేసే పనులకు అధికారులు తాజాగా టెండర్లను ఆహ్వానించారు. జనవరి 15 నాటికి అగ్రిమెంట్ పనులు పూర్తి చేసి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు రూ. 2,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిని వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 149 మండల కేంద్రాల నుంచి సంబంధిత జిల్లా కేంద్రాలకు రెండు లేన్ల రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ కేంద్రాల మీదుగా ఉన్న రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చే పనులకు సంబంధించి తొలిదశలో దాదాపు 3,200 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,200 కిలోమీటర్ల రోడ్ల పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల కోసం రూ. 2,585 కోట్లు, నియోజకవర్గ కేంద్రాల మీదుగా ముఖ్యమైన రోడ్లను రెండు లేన్లుగా మార్చేందుకు రూ. 3,704 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 389 వంతెనల నిర్మాణం కోసం రూ. 1,974 కోట్లను కేటాయించింది. మూడేళ్ల కాలంలో ఈ మొత్తం పనులు పూర్తి చేయాల్సి ఉంది. రోడ్లు నిర్మించిన తర్వాత ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత సదరు కాంట్రాక్టర్లదేనని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా రోడ్ల నిర్వహణ చార్జీలనూ రెట్టింపు చేసింది. అయితే కాంట్రాక్టర్ల లబ్ధికే ప్రభుత్వం ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ బీటీ సింగిల్ రోడ్డుకు కిలోమీటర్‌కు నిర్వహణ చార్జీ ఇప్పటి వరకు రూ. 12 వేలుండగా దాన్ని రూ. 24 వేలకు, డబుల్ రోడ్డుకు రూ. 15 వేలుండగా రూ. 30 వేలకు, ఇక మట్టి, కంకర రోడ్డుకు రూ. 6 వేలుండగా దాన్ని రూ. 12 వేలకు పెంచింది.


