
జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42% కోటా జీవోపై హైకోర్టు స్టే విధించడంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందు కెళ్లాలనేదానిపై ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు అటు రాజకీయ వర్గాలు, ఇటు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు తీర్పు దరిమిలా ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే ఈ అంశంపై పకడ్బందీగా ముందుకు వెళ్లడంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
అసలు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేది కూడా శుక్రవారం అర్ధరాత్రికి స్పష్టత రావడంతో, ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకటి కాగా.. జీవో అమలుపై స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు సూచనలకు అనుగుణంగా ఆరు వారాల పాటు వేచి ఉండటం రెండో ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఆ సమయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు పంపిన బిల్లులకు కూడా మూడు నెలల సమయం పూర్తవుతుందని, అప్పుడు అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ల జీవోకు అనుకూల నిర్ణయాన్ని కోర్టుల నుంచి ఆశించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు.