‘మౌంటెన్‌ డ్యూ’పై హక్కులు పెప్సీకోవే..  | Sakshi
Sakshi News home page

‘మౌంటెన్‌ డ్యూ’పై హక్కులు పెప్సీకోవే.. 

Published Sun, Nov 6 2022 4:11 AM

Telangana High Court Only PepsiCo Can Use Mountain Dew Trademark - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘మౌంటెన్‌ డ్యూ’ట్రేడ్‌మార్క్‌పై పెప్సికోకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. మాగ్ఫాస్ట్‌ పానీయాల కంపెనీ మౌంటైన్‌ డ్యూ లేబుల్‌పై వాటర్‌ బాటిల్‌ విక్రయించడాన్ని సవాల్‌ చేస్తూ పెప్సీకో తొలుత ట్రయల్‌ కోర్టును ఆశ్రయించింది. సదరు లేబుల్‌పై ఇరు కంపెనీలకు హక్కులున్నాయని ట్రయల్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే కూల్‌డ్రింక్‌కు సంబంధించి పెప్సికోకు, వాటర్‌ బాటిల్‌కు సంబంధించి మాగ్ఫాస్ట్‌కు హక్కులున్నాయంది.

దీన్ని పెప్సీకో హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పి. నవీన్‌రావు, జస్టిస్‌ జి.రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెప్సీకో తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. 1985లోనే పెప్పీకో మౌంటైన్‌ డ్యూ పేరిట ట్రేడ్‌మార్క్‌ పొందిందన్నారు. మాగ్ఫాస్ట్‌ ఆ లేబుల్‌ను వినియోగించడం చట్టవిరుద్ధమన్నారు. మాగ్ఫాస్ట్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పెప్సీకో ట్రేడ్‌మార్క్‌ పొందడంపై తమకు తెలియదని, 2000 సంవత్సరం నుంచి తాము మౌంటెన్‌ డ్యూ పేరిట వాటర్‌ బాటిళ్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మౌంటెన్‌ డ్యూపై పెప్సీకో కంపెనీకే హక్కులున్నాయని చెప్పింది. కూల్‌డ్రింక్, వాటర్‌ బాటిల్‌ ఒకే పేరుపై ఉంటే వినియోగదారులు తికమకపడటంతో పాటు రెండూ పెప్సీకోవే అనుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది.    

Advertisement
Advertisement