ఆరేళ్ల తర్వాత ధిక్కరణ పిటిషన్‌ విచారణార్హం కాదు 

Telangana High Court Hits Out At State Officials For Ignoring Its Orders - Sakshi

అధికారులకు శిక్ష విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు కొట్టివేత 

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఏడాదిలోగా మాత్రమే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2009లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ 2015లో దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌కుమార్, రంగారెడ్డి సీసీఎఫ్‌ సునీతా భగవత్‌ తదితరులకు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత కోర్టుధిక్కరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది.

ఈ మేరకు వీరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 383 ఎకరాల్లో రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూమి తమదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి.. పిటిషనర్ల అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 2015లో వారు కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top