బండి భగీరథ్ పిటిషన్‌లో హైకోర్టు
వాదనలకే 3 గంటలకుపైగా సమయం పట్టింది
అన్ని పక్షాల వాదనలు సమగ్రంగా పరిశీలించాలి
హడావుడి మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించలేమన్న న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)పై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వు చేసింది. ఈనెల 21న ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. వాదనలకే 3 గంటలకుపైగా సమయం పట్టిందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని, అన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అన్ని పక్షాలు చేసిన వాదనలు, గత తీర్పులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందంటూ ఉత్తర్వులను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌ను అరెస్టు చేయకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా స్టేటస్‌కో ఆదేశాలు ఇవ్వాలని కోరగా, నిరాకరించింది. తనపై పేట్‌బïÙరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం రాత్రి మరోసారి విచారణ చేపట్టింది.
పోలీసులు కుమ్మక్కు
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘గత సంవత్సరంలోనే బాధితురాలు, నిందితుడు స్నేహితులుగా మారారు. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు నాలుగుసార్లు బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనడంలో వాస్తవం లేదు. పోలీసులు బాధితులతో కుమ్మక్కై తొలుత ఉన్న సెక్షన్లకు తోడు పోక్సో సెక్షన్లు 5, 6ను చేర్చారు.
బెయిల్ రాకుండా పూర్తి న్యాయ సలహాతో ఇచి్చన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్‌ఐఆర్ మార్చారు. నానక్‌రామ్‌గూడ, తర్వాత ఫామ్‌హౌస్‌లకు వెళ్లినప్పుడు వారి వెంట మిత్రులు కూడా ఉన్నారు. బాధితురాలికి గతంలోనే ఆల్కహాల్ అలవాటు ఉంది. బాధితురాలు మైనర్ కాదు (కొన్ని సర్టీఫికెట్లను సమరి్పంచారు). నాలుగున్నర నెలల వరకు ఫిర్యాదు చేయకపోవడంలో కుట్రదాగి ఉంది. బాధితురాలు పలుమార్లు బెదిరిస్తూ సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపారు. దీంతో ఆమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని బాధితురాలి తల్లిదండ్రులకు పిటిషనర్ చెప్పారు’ అని పేర్కొన్నారు.
పిటిషనర్‌కు నేర చరిత్ర...
బాధితురాలి తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘బాధితురాలి డాక్యుమెంట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది సమరి్పంచడం అభ్యంతరకరం. బాధితురాలు మేజర్ అనేది నిరాధార ఆరోపణ. బర్త్ సర్టీఫికెట్ స్కూల్‌లో ఇచ్చింది ప్రధాన ఆధారం. దీనిపై ఏది ప్రామాణికమో సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. మున్సిపల్ అధికారులు ఇచి్చన పత్రం, టెన్త్ సర్టీఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.
భగీరథ్ ఒత్తిడితో బాధితురాలు అతని ప్రేమను అంగీకరించింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. పెళ్లి చేసుకుంటానంటున్నాడన్న నమ్మకంతో మరికొందరు కూడా ఉండటంతో భగీరథ్ వెంట తమ అమ్మాయిని తల్లిదండ్రులు పంపారు. అక్కడ బలవంతంగా ఆల్కహాల్ తాగించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని అవమానించేలా రూ.50 వేలు పంపగా, ఆమె వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కు పంపింది. నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో అందరి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. నిందితుడికి గతంలోనే నేర చరిత్ర ఉంది’ అని పేర్కొన్నారు.
ఐవోకు ఎఫ్‌ఐఆర్‌లో మార్పు అధికారం..
పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘పుట్టిన రోజు (2008, ఆగస్టు), ఇతర సర్టీఫికెట్లు దర్యాప్తు అధికారి నుంచి తీసుకున్నాం (వాటిని కోర్టుకు సమరి్పంచారు). పోక్సో కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యంకాదు. ఇలాంటి కేసుల్లో కూడా నిందితులకు బెయిలిస్తే చట్టంపై నమ్మకం లేకుండా పోతుంది. ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసే అధికారం దర్యాప్తు అధికారి (ఐవో)కి ఉంటుంది. సేకరించిన వివరాల ఆధారంగా సెక్షన్ల మార్పు, నిందితులను చేర్చడం చేయొచ్చు’ అని చెప్పారు.
నాపైనే తీవ్ర ఆరోపణలు...
కేసు విచారణకు స్వీకరించడానికి ముందు న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో తనపై, తన భర్తపై సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు చేశారన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని భావించానని, కానీ, వెకేషన్ కోర్టు అయినందున అన్ని పక్షాల న్యాయవాదులంతా అంగీకరిస్తేనే వాదనలు వింటానని చెప్పారు.
అయితే, సోషల్ మీడియా పోస్టులు తాము కూడా చూశామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తిపై అత్యంత నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిని తొలగించాలని డీజీపీని కోరినట్లు పీపీ పల్లె నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేసుల విచారణ ప్రారంభించిన న్యాయమూర్తి రాత్రి 12 గంటల వరకు విచారణ చేపట్టడం గమనార్హం.


