
సాక్షి, హైదరాబాద్: కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నా వ్యవసాయ అధికారులు స్పం చకుండా నిద్రపోతున్నారా అంటూ హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు? నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్ని దుకాణాల లైసెన్లు రద్దు చేశారు? ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? తదితర వివరాలన్నీ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ములుగు జిల్లాకు చెందిన ఎంపీపీ సీహెచ్ సతీష్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు పలు విత్తన విక్రయ దుకాణాల నుంచి మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకొని నాణ్యతాపరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని, త్వరలోనే నివేదికలను సమర్పిస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 6కు వాయిదా వేస్తూ ఆ లోగా తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.