TS: వాహనం సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదు 

Telangana HC Says Police Cant Seize Vehicles In Drunk Driving Cases - Sakshi

పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టు బడిన వాహనాలను సీజ్‌ చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనాలు సీజ్‌ చేసే సమయంలో మోటార్‌ వెహికల్‌ చట్టంలోని సెక్షన్‌ 448–ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని చెప్పింది.  తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్‌ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో తమ వాహనాలను సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 41 పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. 

మరొకరికి అప్పగించొచ్చు... 
‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనానికి సంబంధించిన ఆర్సీ చూపిస్తే ఆ వాహనాన్ని విడుదల చేయాలి. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే ఆయన్ను వాహనం నడపకుండా అడ్డుకోవచ్చు. అదే వాహనంలో లైసెన్స్‌ కలిగి మద్యం సేవించని వారు ఉంటే వారికి వాహనాన్ని అప్పగించవచ్చు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్‌ మినహా ఎవరూ లేకపోతే వాహనదారుని బంధువులు లేదా సన్నిహితులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఒకవేళ వాహనాన్ని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోతే సమీప పోలీస్‌స్టేషన్‌కు ఆ వాహనాన్ని తరలించి సురక్షితంగా ఉంచాలి.

వాహన డ్రైవర్‌ మద్యం సేవించారన్న కారణంగా ఆ వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదు. ఒకవేళ వాహనదారుడిని ప్రాసిక్యూట్‌ చేయా లని పోలీసులు భావిస్తే వాహనాన్ని సీజ్‌ చేసిన 3రోజుల్లోగా సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలి. ఈ మేరకు న్యాయమూర్తులు చార్జిషీట్లను మూడు రోజుల్లో విచారణకు స్వీకరించాలి. కోర్టు విచారణ ముగిసిన వెంటనే సంబంధిత ఆర్‌టీఏకు సమాచారం ఇచ్చి ఆ వాహనాన్ని పోలీసు అధికారులు విడుదల చేయాలి’అని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top