త్వరలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీ

Telangana Govt Decided To Appoint Full Fledged Committee For RERA - Sakshi

చైర్‌పర్సన్, సభ్యుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్థి లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటైన ‘రెరా’కు త్వరలో పూర్తిస్థాయి కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో న్యాయబద్ధమైన ‘రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ’ (రెరా)లను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా స్థాయి అధికారి చైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇద్దరు పూర్తిస్థాయి సభ్యులు ఉంటారు. అయితే ‘రెరా’కు ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రెరాకు వచ్చే దరఖాస్తుల పరిశీలన, అనుమతులు అన్నీ ఆయన నేతృత్వంలోనే సాగేవి. కాగా రియల్‌ వెంచర్లు, ఫ్లాట్ల నిర్మాణంలో ‘రెరా’ నిబంధనలకు తిలోదకాలిచ్చి పలు సంస్థలు, రియల్‌ వ్యాపారులు దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో ‘రెరా’కు పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పురపాలక శాఖ ఆసక్తి, అర్హత గల వారి నుంచి చైర్‌పర్సన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తును ఆహ్వానించింది. ఫిబ్రవరి 17వ తేదీలోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని కోరింది. రెరా వెబ్‌సైట్, తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తుదారులకు అవసరమైన అర్హతలు, వేతనం వివరాలన్నీ ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top