భద్రాద్రి జిల్లాలో గవర్నర్‌ పర్యటన.. ఢిల్లీ పర్యటన రద్దు చేస్కొని మరీ.. | Sakshi
Sakshi News home page

భద్రాద్రి జిల్లాలో గవర్నర్‌ పర్యటన.. ఢిల్లీ పర్యటన రద్దు చేస్కొని మరీ..

Published Sun, Jul 17 2022 3:47 AM

Telangana Governor To Visit Flood Hit Bhadrachalam On Sunday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కనీవినీ ఎరుగనిరీతిలో గోదావరి మహోగ్రరూపంతో గోదావరి తీర ప్రాంతాల్లో కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, వరద ప్రభావిత భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో ఆదివారం గవర్నర్‌ తమిళిసై పర్యటించనున్నారు. శనివారంరాత్రి ఆమె రైలుమార్గం ద్వారా కొత్తగూడెంకు బయలుదేరివెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున మణుగూరుకు చేరుకోనున్నారు. గవర్నర్‌ పర్యటనను అధికార టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుండగా, వరదబాధితులను కలుసుకుని వారి కష్టాలను అడిగి తెలుసుకోవడానికి ఈ పర్యటన జరుపుతున్నట్టు ఆమె వెల్లడించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు విందులో పాల్గొనడానికి గవర్నర్‌ తమిళిసై ఆదివారంరాత్రి ఢిల్లీకి వెళ్లాల్సింది. కానీ, భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల దీనస్థితిని చూసి చలించిన గవర్నర్‌ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని కొత్తగూడెం జిల్లాకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తమిళిసై రాష్ట్రపతికి ఫోన్‌లో వివరించి, తాను అత్యవసరంగా కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉందని విన్నవించారని పేర్కొంది.  

పునరావాస శిబిరాలను సందర్శించనున్న గవర్నర్‌ 
కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్‌ పునరావాస కేంద్రాలను సందర్శించి వరదబాధితులను కలుసుకోనున్నారు. రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి వచ్చిన విరాళాలు, సామగ్రిని బాధితులకు పంపిణీ చేయనున్నారు. బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయా­లని, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాలు, ఇతర ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య, ఇత­ర సహాయాన్ని అందించాలని తమిళిసై ఈఎస్‌ఐ వైద్య కళాశాల, రెడ్‌క్రాస్‌ సంస్థలను కోరారు. కాగా, వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలకు గవర్నర్‌ పర్యటనతో ఆటంకం కలగనుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్‌ పర్యటన రాజకీయమేనని ఆరోపిస్తున్నాయి.

ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్‌ తీసుకోవాలి: గవర్నర్‌ 
అమీర్‌పేట (హైదరాబాద్‌): కరోనా నివారించాలంటే ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం అమీర్‌పేట 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌కు వైద్య సిబ్బంది టీకా వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement