Tamilisai Soundararajan: మహిళలకు అనుక్షణం అండగా ఉంటాం

Telangana Governor Tamilisai Soundararajan Interacts With Mahila Darbar Petitioners - Sakshi

మహిళా దర్బార్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడి

మహిళలపై జరిగిన నేరాల్లో చర్యల నివేదిక ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు: ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆపదలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. మహిళల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ ఏర్పాటు చేశామన్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దర్బార్‌లో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖాశర్మతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. మహిళల కోసం మాత్రమే ఈ దర్బార్‌ కృషి చేస్తుందని, వివాదాలకు తావులేకుండా వీలైనంత వేగంగా సమస్యను పరిష్కరించడమే దీని లక్ష్యమని చెప్పారు. మహిళల సమస్యలను పరిష్కరించేందుకు జూన్‌ 10న ఏర్పాటు చేసిన మహిళా దర్బార్‌కు అనూహ్య స్పందన వచ్చిందని.. దాదాపు 500 మంది మహిళలు హాజరై తమ సమస్యలు చెప్పుకొన్నారని వివరించారు.

అందులో న్యాయ సంబంధిత అంశాలు 41 ఉన్నాయని.. ఆయా కేసులకు సంబంధించి లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, సెంటర్‌ ఫర్‌ ప్రాక్టీసింగ్‌ లా తరఫున పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారంలో జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) చురుకుగా పనిచేస్తోందని ప్రశంసించారు.

రాష్ట్రంలో భారీగా పెండింగ్‌ కేసులు..
తెలంగాణలో పెద్ద సంఖ్యలో మహిళల సమస్యలకు సంబంధించి పెండింగ్‌ కేసులు ఉన్నాయని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ చెప్పారు. మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. అక్కడ స్పందన రాకుంటే రాష్ట్ర మహిళా కమిషన్‌కుగానీ, జాతీయ మహిళా కమిషన్‌కు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. గవర్నర్‌ తమిళిసై మహిళా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుండటం గొప్ప విషయమని ప్రశంసించారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ గవర్నర్‌ స్థాయి వ్యక్తులు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి ‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు (ఏటీఆర్‌)’ ఇవ్వాలని ఎన్‌సీ డబ్ల్యూ కోరిందని.. కానీ ఇప్పటికీ ఆ వివ రాలు అందలేదని, దీనిపై డీజీపీని కలిసి చర్చి స్తానని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి 41 మంది బాధిత మహిళలను పిలవగా 27 మంది హాజరయ్యారు.

వారికి లీగల్‌ కౌన్సెలింగ్‌తో పాటు న్యాయ పరమైన అంశాల్లో సహకారం అందించేందుకు వీలుగా పూర్తి వివరాలను తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కవాడిగూడకు చెందిన జ్యోతి, మల్కాజ్‌గిరికి చెందిన ఉమారాణి, ఆత్మకూరుకు చెందిన సంధ్యకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top