టీచర్లందరికీ బదిలీ చాన్స్‌

Telangana Government Key Decision To Provide Teachers Transfer - Sakshi

317 జీవో ఉపాధ్యాయులకు అవకాశం 

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

25 వేల మందికి ఊరట!

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయులందరికీ బదిలీ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.

317 జీవో ద్వారా కొంతకాలం క్రితం కొత్త జిల్లాలకు వెళ్లిన దాదాపు 25 వేలమంది టీచర్లు ఈ నెల 12 నుంచి 14 వరకూ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ గత నెల 27న విడుదలైంది. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న స్కూల్‌లో కనీసం రెండేళ్ల సర్వీసు ఉంటేనే బదిలీకి అర్హులని ప్రభుత్వం పేర్కొంది.

ఈ నేపథ్యంలో 59 వేల మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాలను డీఈవోలు పరిశీలించారు. సీనియారిటీ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే 317 జీవో ద్వారా బదిలీ అయి న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వడంతో బదిలీల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లు ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన సర్వీసును కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

పైరవీ టీచర్లలో గుబులు
బదిలీల్లో ఉన్న కొన్ని ఆప్షన్లను ఉపయోగించుకుని అడ్డగోలుగా పైరవీ బేరాలు కుదుర్చుకున్న కొంత మంది టీచర్లలో తాజా పరిణామాలు గుబులు పుట్టిస్తున్నాయి. టీచర్లు లేదా వారి కుటుంబంలోని వారికి దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సేవల కోసం కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకునే వెసులుబాటు మార్గదర్శకాల్లో పొందుపరిచారు. వాస్తవానికి అనేక మంది ఈ కోటాను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.

అనారోగ్య కోటా కింద దరఖాస్తు చేసిన వారికి కూడా సీనియారిటీని బట్టి ప్రాధాన్యతనిస్తారు. ఈ ప్రక్రియలో కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లతో పైరవీలు చేయించుకున్నట్టు, దీని కోసం మధ్యవర్తులకు రూ. లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా 317 జీవో టీచర్లకు కూడా అనారోగ్య కోటా వర్తించనుంది. దీంతో ఈ కోటాలో తమ సీనియారిటీ మారుతుందేమోననే ఆందోళన పైరవీలు చేసుకున్న ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది.

అలా చేస్తే క్రెడిట్‌ మనకే వచ్చేదిగా..
బదిలీల మార్గదర్శకాల్లో జీరో సర్వీసు నిబంధన ఉండాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. కానీ పాఠశాల విద్యా డైరెక్టర్‌ ఇందుకు అడ్డుపడ్డారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం మంత్రి వద్ద మంగళవారం చర్చకు వచ్చినట్టు తెలిసింది. మనమే జీరో సర్వీస్‌ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో అమలు చేస్తున్నారు తప్ప, ప్రభుత్వం ఔదార్యంతో వ్యవహరించిందనే క్రెడిట్‌ రాదు కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top