ద్యావుడా!.. పదకొండేళ్లకు కదిలిన అవినీతి చిట్టా

Telangana: Gov Officers Drda Scam Huge Money Corrupt Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: అది 2011 సంవత్సరం. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్‌డీఏ)లో వెలుగుచూసిన గడ్డపారల స్కాం ఉమ్మడి జిల్లాను కుదిపేసింది. డీఆర్‌డీఏ అధికారుల ఆగడాలు చూసి, విని ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖ 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత కొంతకాలం క్రితం తుది నివేదికను సమర్పించింది. నిందితులపై చేసిన విచారణ ఆధారంగా పలు సూచనలు, సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించిన డీఆర్‌డీఏ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చేసిన సిఫారసులను అమలు చేయాలని ఆయా విభాగాలకు అధికారికంగా ఇటీవల లేఖలు రాసింది. ఈ కుంభకోణంలో ఏ–1పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఏ–2, ఏ–3లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని స్పష్టంచేశారు.

ఐకేపీ ఫిర్యాదుతో వెలుగులోకి..
►ఉమ్మడి రాష్ట్రంలో 2010–11 ఆర్థిక సంవత్సరంలో డీఆర్‌డీఏ చేపట్టిన అనేకపనులపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా గడ్డపారల కొనుగోళ్లలో గోల్‌మాల్, అభయహస్తం పింఛన్‌ పథకంలో నిధుల పక్కదారి.. తదితర వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టాయని, సాక్షాత్తూ డీఆర్‌డీఏ అధికారులు కొందరితో కుమ్మక్కై ప్రజాధనాన్ని జేబులో వేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్‌లోని ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) సిబ్బంది ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారు. 2011 మే 9వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన ఆరోపణలు ఇవే!
►గడ్డపారల కొనుగోళ్లలో సరఫరా చేసే కంపెనీతో రూ.3.8 కోట్లకు రహస్య ఒప్పందం చేసుకున్నారు. అప్పటి ఉమ్మడి జిల్లాలోని 57 మండలాల్లోని మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేయల్సి ఉండటం గమనార్హం. ఇలా తప్పుడుమార్గంలో వెళ్లినందుకు రూ.38 లక్షల కమిషన్‌ దక్కిందని ఆరోపణలు.
► అభయహస్తం పింఛన్‌ పథకంలో నిధుల రూ.18 లక్షలు పక్కదారి. ట్రైనీలకు భోజనం పేరిట రూ.35 లక్షలు ఖర్చు చూపారు. 
► దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఇప్పటి అంబేద్కర్‌ స్టేడియంలో స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళలు సమావేశం పేరిట రూ.40లక్షలు తప్పుడు బిల్లుల పేరిట క్లయిం చేసుకున్నారు. ఇందులో డెకరేషన్‌కు రూ.20 లక్షలు చూపడం విశేషం.
► యాభైవేల స్వయం సహాయ గ్రూపులకు పుస్తకాల ప్రింటింగ్‌ పేరిట రూ.15 లక్షల బిల్స్‌ పెట్టారు. విలేజ్‌ మార్కెటింగ్‌ కమిటీ మెంబర్స్‌కు శిక్షణ పేరిట రూ.15 లక్షలు దుర్వినియోగం. రబీ పంటలో గ్రామ సమాఖ్యల సాయంతో రైస్‌ మిల్లర్ల నుంచి దాదాపు రూ.10 లక్షలు వసూలు చేశారు. సదరం క్యాంపు కోసం ఎలాంటి అనుమతి లేకుండా  దాదాపు 40 కంప్యూటర్ల కొనుగోళ్లు.
► ఈ మొత్తం స్కాంలో రూ.1.66 కోట్ల మేరకు నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఇందులో స్వయం సహాయక గ్రూపులకు పుస్తకాల ముద్రణ కోసం రూ.15 లక్షల విషయంలో, రైస్‌మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు, అనుమతి లేకుండా కంప్యూటర్ల కొనుగోలు ఆరోపణలు ఏసీబీ దర్యాప్తులో రుజువు కాలేదు. మిగిలిన ఆరోపణలకు సంబంధించి శాఖాపరమైన చర్యలు సూచిస్తూ పంచాయతీరాజ్‌శాఖకు అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సిఫారసులు పంపారు.

ముగ్గురు నిందితులపై చర్యలకు లేఖలు..
ఈ కేసులో ఏ–1గా అప్పటి డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ పడాల రవీందర్‌ (ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లాలో డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌), ఏ–2గా అర్ష వేణుగోపాల క్రిష్ణ (ఎలక్ట్రానిక్‌ డేటా ప్రాసెసర్, డీఆర్‌డీఏ కరీంనగర్,), ఏ–3 ఐలినేని కృష్ణారావు (డీఆర్‌డీఏ, ఏపీఎం/కాంట్రాక్ట్‌ ఉద్యోగి) ఈ ముగ్గురిలో పడాల రవీందర్‌పై వెంటనే శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని, మిగిలిన వేణుగోపాల్‌ క్రిష్ణ, ఐలినేని రవీందర్‌లను విధుల నుంచి తొలగించాలని తుది విచారణ అనంతరం ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సిఫారసు చేశారు. ఈ సిఫారసుల ఆధారంగా పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఇటీవల ఆయా విభాగాలకు లేఖలు రాశారు.

చదవండి: ట్రెండు మారుతోంది...ఆడబిడ్డే కావాలి..! ‘కారా’ దరఖాస్తు విధానం ఇలా!

     
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top