Telangana: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం

Telangana: Godavari river hits 70 ft mark, Army joins rescue operations - Sakshi

సహాయక చర్యల కోసం మోహరింపు

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన ఆర్మీ

101 మందితో కూడిన ప్రత్యేక దళం కేటాయింపు

పర్యాటక పడవలు, రబ్బర్‌ బోట్లు, రక్షణ పరికరాలు కూడా..

ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చూడాలన్న సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గతంలో ఎన్నడూ లేనంతగా మహోగ్ర రూపం దాల్చిన గోదావరి బారి నుంచి ప్రజ లను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సైన్యాధికారులు 101 మంది బృందంతో కూడిన ప్రత్యేక దళాన్ని భద్రాచలం ముంపు ప్రాంతాల్లో సేవలందించేందుకు కేటాయించారు. దీంతో వారంతా హైదరాబాద్‌ నుంచి భద్రాచలం బయల్దేరి వెళ్లారు. సైన్యంతో పాటు ప్రత్యేకంగా హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరదలపై సమీక్ష సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు హెలికాప్టర్లను ప్రజలను రక్షించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలకు వీలుగా సిద్ధం చేశారు. రబ్బర్‌ పడవలతో పాటు, రక్షణ పరికరాలు, లైఫ్‌ జాకెట్లను యుద్ధప్రాతిపదికన భద్రాచలానికి తరలిస్తున్నారు. రెస్క్యూ టీమ్‌లను కూడా రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి వీలైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే తరలించిన రక్షణ సామగ్రి సరిపోని పక్షంలో మరింత సామగ్రి పంపించాలని సూచించారు.

చదవండి: (భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం)

80 అడుగుల వరదొచ్చినా ఎదుర్కోవాలి 
వర్షాలు, వరదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష, సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. వరద నీరు 80 అడుగులకు చేరినా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎస్‌ ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. శిబిరాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ఐటీసీ భద్రాచలం వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. 

చదవండి: (గోదావరి ఉధృతి.. పాత రికార్డులన్నీ బద్దలు..?!)

పర్యవేక్షణ అధికారిగా సింగరేణి ఎండీ
వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరామని ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎస్‌ తెలిపారు. ఈ మేరకు 68 మంది సభ్యులుగల ఇన్‌ఫాంట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం, 23 మంది సభ్యులు గల ఇంజనీరింగ్‌ బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లాయని తెలిపారు. పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా పంపామని చెప్పారు. అగ్నిమాపక విభాగానికి చెందిన 7 బోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. లైఫ్‌ జాకెట్లు కలిగిన 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని వివరించారు. ఈ జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, సింగరేణి కాలరీల ఎండీ ఎం.శ్రీధర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు. సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్‌లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచితే..వరద సహాయక చర్యలు సమర్ధవంతంగా చేపట్టేందుకు అవకాశముందని మంత్రి పువ్వాడ చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top