ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే ఎలా? | Telangana: Doctors Concern Over Experience Certificate | Sakshi
Sakshi News home page

ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే ఎలా?

Nov 30 2022 2:33 AM | Updated on Nov 30 2022 2:33 AM

Telangana: Doctors Concern Over Experience Certificate - Sakshi

►ఆమె పేరు డాక్టర్‌ సునీత (పేరు మార్చాం). ఆమె ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్లు కాంట్రాక్టు వైద్యురాలిగా పనిచేస్తున్నారు. సివి­ల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల కోసం అనుభవ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. కానీ అక్కడి ఆసుపత్రి అధిపతి కేవలం మూడేళ్లకే సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఏవో సాంకేతిక కారణాలు చూపించి మూడేళ్లకే ఇవ్వడంతో నాలుగు వెయిటేజీ మార్కులు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తనకు ప్రభుత్వ వైద్య ఉద్యోగం రావాల్సి ఉండగా, ఇప్పుడు జాబితాలో పేరు లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు.

►ఎంబీబీఎస్‌ అర్హతతో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగింద­ని ఇలా పలువురు అభ్యర్థులు వైద్య,ఆరో­గ్యశా­ఖకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు లిఖిత­పూర్వకంగా, మరికొందరు నేరుగా వైద్య, ఆరో­గ్య­శాఖ ఉన్నతా­ధికారులకు ఫిర్యా­దు చేస్తున్నా­రు. ఈ ఫిర్యాదులతో ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అలాంటి ఫిర్యా­దు­ల్లో న్యాయం ఉన్నట్లు తేలితే పరిశీలి­స్తామని, దీనిపై విచారణ చేసి తగు చర్యలు చేపడతామని అంటున్నారు. దీంతో సకాలంలో పూర్తి కావాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రి­య మరికొన్ని రోజులు కొనసాగే అవకా­శ­ముంది. వాస్తవానికి గత శనివారమే ముగియాల్సిన వెరిఫికేషన్‌ ప్రక్రియ, కొన్ని కారణాల వల్ల పొడిగించారు.

అనుభవపత్రాల్లో కొర్రీలు...
వైద్య ఆరోగ్యశాఖ నియామకాల్లో కాంట్రాక్టు,  ఔట్‌­సోర్సింగ్‌ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేర­కు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మొత్తం వివిధ విభాగాల్లో 10,028 ఖాళీ­లను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీచే­యాలని నిర్ణయించారు.  ప్రస్తుతం ఎంబీబీఎస్‌ అర్హతతో కూడిన 969 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ట్యూటర్లు తదితర పోస్టులకు ఎంబీబీఎస్‌లో పొందిన మార్కుల ఆధా­రంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. వారు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ అభ్యర్థులైతే 20 పాయింట్ల వరకు వెయిటేజీ ఇస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ అనుభవ­మున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరు నెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు.

వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవా­ఖానాల్లో పనిచేసే వారికి అనుభవ ధ్రువీకరణను జిల్లా వైద్యాధి­కారులు ఇవ్వాలి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసేవారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. కానీ కొందరికి మాత్రం సంబంధిత వైద్యాధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో కొర్రీలు పెట్టారని కొందరు డాక్టర్లు విమర్శిస్తున్నారు. వెయిటేజీ మార్కులకు సంబంధించి అనుభవ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంలో ఎక్కడిక­క్కడ రాజకీయాలు జరిగా­యని ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము నష్టపో­యామని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులతో తుది జాబితా విడు­దలకు ఆటంకాలు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement