కేంద్రవాటానూ రాష్ట్రం కొనాలి

Telangana Congress Supports Singareni Workers Strike: Revanth Reddy - Sakshi

సింగరేణి కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు: రేవంత్‌రెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ సంస్థ కార్మికులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. 132 ఏళ్లుగా దేశానికి నిబద్ధతతో కూడిన సేవలందిస్తోన్న సింగరేణి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు సెస్, డివిడెండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలు సమకూరుతుందన్నారు. అలాంటి సంస్థలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం ఆ సంస్థకు ఉరి వేయడమేనని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు.

అపార బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో కానీ, పన్ను చెల్లింపుల్లో రాయితీలు ఇవ్వడంలో కానీ కేంద్రాన్ని ఏనాడూ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించిన పాపాన పోలేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో మోదీతో ఒప్పందం కుదుర్చుకుని సభ జరగకుండా అడ్డుపడటానికి బదులు సింగరేణి సమస్య గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు.

గనుల వేలం సమీపించడంతో మొక్కుబడిగా కార్మికుల పక్షాన కేంద్రానికి లేఖ రాసిన కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సింగరేణికి బకాయి పడ్డ రూ.13వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. 

సింగరేణి సమ్మెకు సీపీఎం మద్దతు: తమ్మినేని 
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి, కార్మికుల సమ్మెను ఉపసంహరించేలా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేశారు. సంస్థ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. సమ్మెలో బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్‌ కూడా పాల్గొందంటే ఈ ప్రైవేటీకరణ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top