Ganesh Chaturthi 2022: గణేష్‌ ఉత్సవాలు షురూ.. ఈ  జాగ్రత్తలు, సూచనలు తప్పనిసరి.. 

Telangana: Conditions Precautions At Ganesh Mandapas and Electrical Safety - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: గణేశ్‌ నవరాత్రోత్సవాల సందర్భంగా వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకొనే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆగస్టు 31న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడంతో గణేశ్‌ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని గణేశ్‌ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, విద్యుత్‌ అధికారులు పలు సూచనలు చేశారు. 

పోలీస్‌శాఖ సూచనలు..  
► గణేశ్‌ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు.
►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు.  
►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి. 
►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి.   

►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.  
►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి. 
►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి.

►ఆగస్టు 31న ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్‌ 11న సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం.  
►సౌండ్‌ బాక్స్‌లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. మండపం వద్ద ఒక బాక్స్‌ టైపు స్పీకర్‌ మండప ప్రాంగణంలో మాత్రమే ఇన్‌స్టాల్‌ చేయబడాలి. 
►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. 
►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి. 
►ఏదైన సమాచారం కోసం డయల్‌ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి.

విద్యుత్‌శాఖ సూచనలు.. 
►వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద  తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్‌ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్‌ సర్క్యూట్‌లు, విద్యుత్‌ షాక్‌లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందంటున్నారు.  

►మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్‌డ్‌ ఎలక్ట్రిక్‌ కాంట్రాక్టర్‌ ద్వారా మాత్రమే చేపట్టాలి.  
►విద్యుత్‌ సరఫరా కోసం ఎర్త్‌ లీకేజ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్‌ను అమర్చుకోవాలి.  
►మండపానికి విద్యుత్‌ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండరాదు.  
► ప్రతి సర్క్యూట్‌పై 800 వాట్ల కంటే అధిక లోడ్‌ వేయరాదు. 

►వరుస విద్యుద్దీపాల కోసం సిల్క్‌వైర్లను వాడడం మంచిదికాదు. దీని వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే ప్రమాదముంటుంది. 
►ప్రతి సర్క్యూట్‌కు ప్రత్యేకించి న్యూట్రల్‌ ఎర్త్‌వైర్‌ను తీసుకోవాలి. 
►మండపాల వద్ద ఎర్తింగ్‌ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. 25 ఎంఎం డయామీటర్, 3 మీటర్ల లోతైన గుంత తీసి ఎర్తింగ్‌ పైప్‌ను అమర్చుకోవాలి.  
►మండపాల్లో విద్యుత్‌ ఎలక్ట్రిక్‌ హీటర్లు, ఎలక్ట్రిక్‌ స్టౌవ్‌లను వాడరాదు. 
►ప్రతి మండపం వద్ద 5 కేజీల కార్బన్‌డయాక్సైడ్‌ నిండి ఉన్న అగ్నిమాపక సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top