
నెల జీతం ఇస్తున్నట్లు రేవంత్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద నిర్మూలనకు ధైర్యంగా పోరాడుతున్న సాయుధ దళాలకు అండగా నిలిచేందుకు.. ఒక నెల వేతనాన్ని విరాళంగా జాతీయ రక్షణ నిధికి ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు చేయూతగా నిలిచే ఉద్యమంలో.. పార్టీ సహచరులు, సన్నిహితులు, పౌరులందరూ చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘భారత్ విజయతీరాన్ని చేరేంతవరకు అందరం ఐక్యంగా సైన్యానికి అండగా నిలవాలని కోరుతున్నా’.. అని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం..
జాతీయ రక్షణ నిధికి ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తా ము కూడా అదే బాటలో వెళ్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రా ష్ట్రంలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ముందుకు రావాలని ఎక్స్ వేదికగా ఆయన కోరారు. ఒక రోజు వేతనాన్ని సైన్యానికి విరాళంగా ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తీర్మానించింది.