మంత్రులు, విప్‌లు, ఎంపీలతో సుదీర్ఘ భేటీలో సీఎం చర్చ

Telangana CM KCR Discusses On Launching National Party - Sakshi

కొత్త పార్టీ అవసరం.. ఏర్పాటు చేస్తే ఏ పేరు పెడదాం? 

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు భేటీలు 

ఆర్థిక ఆంక్షలతో ఇబ్బందిపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నం 

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దాం 

త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘దేశంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం. కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయిలో విఫలమై కనుమరుగవుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చురుకుగా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఇతర రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా తెలంగాణ తరహా పథకాలను దేశమంతటా అమలు చేసేందుకు వీలు కలుగుతుంది..’’ అని మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో పార్టీ పెడితే దానికి ఏ పేరుంటే బాగుంటుందని అభిప్రాయం కోరినట్టు సమాచారం.

ఆంక్షలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి రాజకీయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, పాలనాపరమైన అంశాలు, ప్రతి విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్న పరిస్థితులను అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికకు సంబంధించి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నడుమ ఏకాభిప్రాయ సాధన కోసం మరోమారు అన్ని పార్టీల నేతలతో వరుస భేటీలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

సుదీర్ఘంగా భేటీ అయి.. 
శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర మంత్రులు, అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు, ప్రభుత్వ విప్‌లతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జాతీయ అంశాలపై చర్చించడంతోపాటు రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

శాంతిభద్రతలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, దళితబంధు అమలు, ఆర్టీసీ చార్జీల పెంపు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, 57 ఏళ్లు నిండినవారికి పింఛన్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో పాలన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌.. ప్రతీ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ మండిపడినట్టు సమాచారం. ఇక తాను ఇటీవల జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో జరిపిన భేటీ వివరాలను కూడా సమావేశంలో కేసీఆర్‌ వెల్లడించినట్టు తెలిసింది. 

ఆర్థిక ఆంక్షలతో కేంద్రం కుట్ర 
ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలతో విపక్ష పార్టీలను బెదిరింపులకు గురిచేస్తూ బీజేపీ గూండాయిజం చేస్తోందని సీఎం కేసీఆర్‌ మండిపడినట్టు సమాచారం. ఆంక్షలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి రాజకీయం చేసేందుకు, ఆర్థిక అంశాల్లో రాష్ట్రాన్ని దోషిగా చూపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని.. దీనిని ప్రజలకు విడమర్చి చెప్పాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. బాలికపై అత్యాచార ఘటన సహా అన్ని సందర్భాల్లో పోలీసు యంత్రాంగం సమర్థంగా వ్యవహరిస్తున్నా విపక్షాలు రాజకీయం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించినట్టు సమాచారం.

పాలనాపరమైన విషయాలు, రాజకీయ పరిస్థితులు, కేంద్ర వైఖరి తదితర అంశాలను ప్రజలకు వివరించేందుకు త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భేటీలో సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు తెలిసింది. సభ నిర్వహణ తేదీలు, ఎజెండా వంటివి వారం రోజుల్లో ఖరారు చేయాలని.. త్వరలో కేబినెట్‌ భేటీ కూడా ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. 

తలసాని మినహా అంతా హాజరు 
కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనకు వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రగతిభవన్‌ భేటీకి రాలేదు. హరీశ్‌రావు, కేటీఆర్‌ సహా రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు. ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్‌ నేతకాని, సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావుతోపాటు చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్, విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎంఎస్‌ ప్రభాకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి కూడా భేటీలో పాల్గొన్నారు. 

గవర్నర్‌ తీరు వెనుక రాజకీయ ఎజెండా! 
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. గవర్నర్‌ తమిళిసై ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించడం వెనుక కూడా బీజేపీ రాజకీయ ఎజెండా దాగి ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం. కేంద్రం వైఫల్యాలను నిలదీస్తుంటే మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందని పేర్కొన్నట్టు తెలిసింది. కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరు కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారని.. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top