ప్రైవేట్‌ ఆస్పత్రులు తగ్గేదేలే.. 94 శాతం సిజేరియన్లే!

Telangana: Cesarean Deliveries Increase For Pregnant Ladies - Sakshi

 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 94శాతం సిజేరియన్లే..

రాష్ట్రంలోనే టాప్‌–3లో నిర్మల్‌ జిల్లా

ఆందోళన కలిగిస్తున్న వైద్యారోగ్యశాఖ గణాంకాలు

భైంసాటౌన్‌(ముధోల్‌): జిల్లాలో సిజేరియన్‌ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గత మార్చిలో జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, అంగన్‌వాడీలకు సూచించారు. సిజేరియన్లపై దృష్టి పెట్టాలని సూచించగా, ఆరునెలల్లో మార్పు వస్తుందని కలెక్టర్‌ సైతం మంత్రికి హామీ ఇచ్చారు. ఈ మేరకు తరచూ వైద్యాధికారులు, అంగన్‌వాడీలతో సమావేశాలు నిర్వహిస్తూ సాధారణ కాన్పులు పెంచాలని కలెక్టర్‌ సూచిస్తున్నారు. అలాగే జిల్లాలో సిజేరియన్‌ కాన్పులు ఎక్కువగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై చర్యలు సైతం తీసుకున్నారు. అయినా సానుకూల మార్పు కనిపించడం లేదని వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తుండడం గమనార్హం.

94 శాతం సిజేరియన్లే...
రాష్ట్రంలో 2021–22లో సిజేరియన్‌ ఆపరేషన్లపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో నాలుగు జిల్లాల్లో 94శాతం సిజేరియన్లే నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో నిర్మల్‌ జిల్లా మూడో స్థానంలో ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే కడుపుకోతలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఈఏడాది జనవరి నుంచి మే వరకు జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 2600 వరకు ప్రసవాలు జరుగగా, వీటిలో 2146 సిజేరియన్లే కావడం గమనార్హం. కేవలం 454 సాధారణ కాన్పులు జరిగాయి. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశీలిస్తే.. 2,925 ప్రసవాలు జరుగగా, 1171 సాధారణ, 1754 సిజేరియన్‌ ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నా.. ఇంకా తగ్గాల్సిన అవసరముంది.

అవగాహన కల్పిస్తేనే...
ఒకప్పుడు సర్కారు దవాఖాన్లలో లేదంటే ఇళ్లలోనే ఎక్కువగా కాన్పులు చేసేవారు. చాలావరకు సాధారణ కాన్పులే జరిగేవి. ఇంటి వద్ద నొప్పులొస్తే మంత్రసాని ఇంటికే వచ్చి ప్రసవం చేసేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మారిన ఆçహార అలవాట్ల కారణంగానో, నొప్పులు భరించలేకనో సిజేరియన్‌ ప్రసవాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కొందరు సమయం, ముహూర్తం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. సిజేరియన్లతో తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమేనని చెబుతున్న ప్రభుత్వం సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని పదేపదే సూచిస్తోంది.

కేసీఆర్‌ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టి మరీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులపై దృష్టి పెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అవగాహన లేకనో, గర్భిణుల బంధువుల ఒత్తిడితోనో సిజేరియన్లు చేస్తున్నారు. సుఖప్రసవానికి వీలులేనప్పుడో, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడో చేయాల్సిన సిజేరియన్లు.. అవసరం లేకున్నా చేస్తున్నారని విమర్శలున్నాయి. ఫలితంగా కడుపు కోతల్లో నిర్మల్‌ జిల్లా టాప్‌లిస్ట్‌లోకి చేరింది. అనవసరంగా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే జిల్లాలో వీటిని తగ్గించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అవగాహన కల్పిస్తున్నాం
ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై దృష్టి పెడుతున్నాం. తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ సిజేరియన్‌ కాన్పులు తగ్గించాలని సూచిస్తున్నాం. కలెక్టర్‌ సైతం ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులతో సిజేరియన్లు తగ్గించాలని సూచిస్తున్నారు. మార్పు రాని పక్షంలో చర్యలు తీసుకుంటాం.
–ధన్‌రాజ్, డీఎంహెచ్‌వో

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top