స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయానికి అవకాశం
గిగ్ వర్కర్ల సంక్షేమ పాలసీకి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 9, 41, 42 అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై పలువురు వ్యక్తులు వేసిన మరో పిటిషన్‌పై ఇటీవల విచారించిన హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ పరిణామాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్ల పెంపునకు తీసుకున్న నిర్ణయానికి న్యాయపరమైన చిక్కులు అడ్డురావడంతో పాత రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహించడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని, అదే సమయంలో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42 శాతం సీట్లను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు దీనిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన పాలసీని మంత్రివర్గం ఆమోదించనుంది.
1 నుంచి విజయోత్సవాలు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి త్వరలో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ –2025 నిర్వహణ, డిసెంబర్ 8న ప్రజా ప్రభుత్వం రెండో వార్షికోత్సవం నిర్వహణ, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీటి నిర్వహణ తీరుతెన్నులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై సైతం మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో అభిప్రాయం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన మద్దతు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకోనున్నారు.


