కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
చెల్లింపుపై ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
ప్రణాళిక రూపకల్పన బాధ్యత మంత్రివర్గ ఉప సంఘానికి
కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
రూ.8 వేల కోట్లకు చేరిన బకాయిలతో ఇక్కట్లలో రిటైర్డ్ ఉద్యోగులు
ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి అవసరమైన నిధుల సర్దుబాటు
వచ్చే నెల 4న జరిగే తదుపరి కేబినెట్‌లో చెల్లింపులపై నిర్ణయం
‘కాళేశ్వరం’పై విచారణ కోసం సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్న సీఎం, ఉత్తమ్
ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుబట్టలేదన్న మంత్రి.. సుప్రీంకు వెళ్లాలా? కమిషన్ గడువు పెంచాలా? అనే దానిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.8 వేల కోట్ల పైచిలుకు పదవీ విరమణ ప్రయోజనాలను వచ్చే 100 రోజుల్లోగా ఎలా చెల్లించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఈ బాధ్యతను అప్పగించింది. వచ్చే నెల 4న జరగనున్న తదుపరి మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. గురువారం సచివాలయంలో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు, ఇన్ సర్వీస్ ఉద్యోగులకు మరో రూ.6,200 కోట్లు కలిపి మొత్తం రూ.14,200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు నివేదించారు. దీంతో పాటు ఇతర అంశాలు చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..సహచర మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి వివరాలు వెల్లడించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం బకాయిలు మిగిల్చిపోయింది..
‘ఉమ్మడి ఏపీలో ఉద్యోగులు రిటైరైన కొన్ని నెలలకే పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించే వారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలను మిగిల్చిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేకపోయాం. కానీ గత 14 నెలలుగా ప్రతి నెలా రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్లను చెల్లించుకుంటూ వస్తున్నాం. అయితే రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసులు, సచివాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుండటంపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రెగ్యులర్ ఉద్యోగుల బకాయిలను సైతం సత్వరమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆలోచన చేసింది.
ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50% కోత
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బకాయిలను వెంటనే చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం, మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం నిధులను కోత పెట్టి రిటైర్డ్ ఉద్యోగుల బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని తీర్మానించింది. బకాయిల చెల్లింపులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలని వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘానికి కేబినెట్ సూచించింది..’ అని పొంగులేటి తెలిపారు.
బరాజ్‌లపైనే సీబీఐ విచారణ కోరుతున్నాం: మంత్రి ఉత్తమ్
సీఎం రేవంత్‌తో పాటు త్వరలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసి కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ చేపట్టాలని కోరతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్, ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్ నివేదికలను ఇప్పటికే సీబీఐకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరి 9 నెలలు గడుతుస్తున్నా స్పందన లేదు. మళ్లీ త్వరలోనే ఈ నివేదికలను సీబీఐ డైరెక్టర్‌కు కూడా అందజేస్తాం..’ అని అన్నారు. కేవలం బరాజ్‌లపై మాత్రమే విచారణ కోరుతున్నామంటూ మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ చేస్తే చేయమనండి అని అన్నారు.
వారి ఆరోపణలతో కోర్టు ఏకీభవించలేదు..
కాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై తాజాగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు సారాంశాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి మంత్రివర్గానికి వివరించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఘోష్ కమిషన్ నియామకాన్ని, కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పు బట్టలేదని అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు, ఎస్‌కే జోషి, స్మిత సబర్వాల్ తమ పిటిషన్లలో చేసిన ఆరోపణలతో న్యాయస్థానం ఏకీభవించలేదని చెప్పారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 8బీ కింద పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతికపర అంశాన్నే తప్పు బట్టిందని, నివేదికలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే ఆదేశించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో అడ్వకేట్ జనరల్ సమావేశమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తారని వెల్లడించారు. హైకోర్టు సూచించిన రీతిలో మళ్లీ సెక్షన్ 8బీ కింద నోటీసులు ఇచ్చిన విచారించడానికి వీలుగా ఘోష్ కమిషన్ గడువును పొడిగించాలా? లేక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా? అన్న అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇతర కీలక నిర్ణయాలు..ఆమోదాలు
– పదవీ కాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలో నామినేషన్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
– గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్íÙప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయం. స్టేడియం 76 ఎకరాల్లో విస్తరించి ఉండగా, రతన్ టాటా పేరుతో రూ.700 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో 64 ఎకరాల్లో స్టేడియం అభివృద్ధి బాధ్యతలను టాటా గ్రూప్‌కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
– మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
– శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


