ఉపఎన్నిక వాయిదాకు సీఎం కుట్ర: బండి 

Telangana: Bandi Sanjay Comments On CM KCR - Sakshi

హుజూరాబాద్‌/కమలాపూర్‌: ‘హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజల మనసు మార్చలేమని సీఎం కేసీఆర్‌ గ్రహించారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసినా ఫలితం లేదనిఆయనకు అర్థమైంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంతిభద్రతల సమస్యను సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం హుజూరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా టీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పోలింగ్‌కు ప్రజలు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేలా కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోనూ టీఆర్‌ఎస్‌ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి విఫలమైందని విమర్శించారు. బీజేపీ దాడులు చేస్తోందని, మత కల్లోలాలు సృష్టించే కుట్ర చేస్తోందంటూ ఆనాడు దుష్ప్రచారం చేసి విఫలమయ్యారని, హుజూరాబాద్‌ ఉపఎన్నికలోనూ మళ్లీ ఇదే కుట్రను అమలు చేయబోతున్నారని ధ్వజమెత్తారు.

కేంద్రమంత్రి ప్రచారంపై దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దారుణమన్నారు. ఓటుకు రూ.20 వేలు పంపిణీ చేయాలని యత్నించి విఫలమవుతుండటంతో ఆ పార్టీ నాయకులతోనే కేసీఆర్‌ భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. కేంద్ర కేబినెట్‌ మంత్రి వస్తే, కనీస భద్రత ఇవ్వకపోవడం దారుణమని, దాడులకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.  

ఓటమి భయంతోనే దాడి  
‘ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్యాంపెయిన్‌పై దాడి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మేం ఏమైనా చేస్తామనే సందేశాన్ని ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ యత్నిస్తోంది. బీజేపీ ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. డబ్బుతో ఓట్లను కొంటాం. రాష్ట్రాన్ని కొల్లగొట్టినం. అవినీతి సొమ్మంతా మా దగ్గరుంది. ఏదైనా చేస్తామని కేసీఆర్‌ అనుకుంటున్నారు’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఉపఎన్నికను అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలనే తీరును చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదన్నారు. 

లీటర్‌ పెట్రోల్‌పై రాష్ట్ర సర్కారు రూ.41 దోపిడీ 
పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. పన్నుల పేరిట కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై రూ.41 దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజలపై కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే ఆ పన్ను మినహాయించి లీటర్‌ పెట్రోల్‌ను రూ.60కే ఇవ్వొచ్చన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరం, కమలాపూర్‌ల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

యూరియా ఫ్రీగా ఇస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కమీషన్ల కోసం బ్రోకర్‌గా వ్యవహరిస్తూ రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ఆ డబ్బును దారి మళ్లించి కేంద్రాన్ని కేసీఆర్‌ అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top