గురువు.. భవితకు ఆదరువు!

Teachers Day Celebration In Karimnagar - Sakshi

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

కరోనా కారణంగా కనిపించని సందడి

సాక్షి, జ్యోతినగర్‌(రామగుండం): మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత మహోన్నత స్థానాన్ని గురువుకు ఇచ్చారు. విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో మనం సన్మార్గంలో నడవడంలో వారి పాత్ర కీలకం. భవిష్యత్‌లో ఏ స్థాయిలో ఉన్నా ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవాలి. ఈ క్రమంలో భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుకున్నాం. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మహనీయుడు. ఈ ఏడాది ఆ వేడుకల రోజు రానే వచ్చింది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. 

తప్పులు సరిచేస్తూ సన్మార్గ బోధన
పాఠశాలల్లో విద్యార్థుల తప్పులు సరిచేస్తూ వారిని సన్మార్గంలో నడిచేలా ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల కృషి అంతా ఇంతా కాదు. క్లాసులో అల్లరి చేస్తున్నా ఎంతో ఓపికగా పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెబుతారు. తప్పు చేస్తే తప్పు అని చెప్పి, భవిష్యత్తులో మళ్లీ చేయవద్దని చెప్పే దయాగుణం గురువులది. అంతటి గొప్ప మనసున్న టీచర్లను ఏటా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కరోనాతో వేడుకలు దూరం
ఉపాధ్యాయ దినోత్సవం వస్తుందంటే ఏటా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులు తమ గురువులను సన్మానించాలని, వారి ఆశీర్వాదం పొందాలని ముందే ప్లాన్‌ చేసుకుంటారు. సెప్టెంబర్‌ 5న ఆనందంతో వేడుకల్లో పాల్గొంటారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా ఆ సందడి కనుమరుగైంది. పాఠశాలల్లో విద్యాబోధన జరగడం లేదు. విద్యార్థులు ఇళ్లకే పరి మితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ దినో త్సవం జరుపుకునే అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వేడుకలు వద్దని ఆదేశాలు వచ్చాయి
కోవిడ్‌–19 నిబంధనలతో పాటు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాప దినాల నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరపవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేస్తున్నాం. పిల్లలు పాఠశాలలకు రావడం లేదు కాబట్టి ఇళ్లవద్ద తల్లిదండ్రులే గురువులుగా వ్యవహరించి, వారి భవిష్యత్తును కాపాడాలి. – బి.డేనియల్, ఎంఈవో, ఉమ్మడి రామగుండం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top