అధ్యాపకురాలి క్రూరత్వం.. ఆస్పత్రి పాలైన విద్యార్థిని

Teacher Punishes Her Student By Standing 8 Hours Outside In Sircilla - Sakshi

ఐదురోజులు 8 గంటల చొప్పున బయట నిలబెట్టిన వైనం

అధ్యాపకురాలిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశం 

వేములవాడ అర్బన్‌: సెలవుపై ఇంటికెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు ఆలస్యంగా వచ్చిందంటూ ఓ అధ్యాపకురాలు ఆమెపట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఐదు రోజులపాటు తరగతి గది బయట 8 గంటల చొప్పున నిలబెట్టడంతో నడవలేని స్థితికి చేరి, ఆదివారం ఆసుపత్రి పాలైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం రేగడి మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళాడిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిహారిక ఈ నెల 18న ఒకరోజు సెలవుపై ఇంటికెళ్లి 22న తిరిగొచ్చింది. ఆలస్యంగా వచ్చిందంటూ నిహారికపై అధ్యాపకురాలు మహేశ్వరి కఠినంగా వ్యవహరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు క్లాస్‌లోకి అనుమతించకపోగా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట నిలుచోబెట్టింది.

దీంతో ఆ విద్యార్థిని నడవలేని స్థితికి చేరింది. ఈ విషయం హాస్టల్‌ ఇన్‌చార్జి దృష్టికి వెళ్లడంతో ఆదివారం ఉదయం వేములవాడ ఏరియా ఆస్పత్రికి నిహారికను తరలించి వైద్యసేవలు అందించారు. దీనిపై కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్యామలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందన్నారు. కాగా, ఘటనపై జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పందిస్తూ అధ్యాపకురాలిని సస్పెండ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌పైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top