రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి | Sakshi
Sakshi News home page

రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి

Published Tue, Feb 13 2024 10:13 AM

Tarun Joshi new CP of Rachakonda - Sakshi

సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ ఎఫెక్ట్‌తో రాచకొండ పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న జి.సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. ఈయన్ను మల్టీ జోన్‌–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్‌ జోషిని రాచకొండ కొత్త సీపీగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు కమిషనరేట్ల నుంచి బదిలీ అయిన అధికారుల్లో ఎన్నికల కోడ్‌ ప్రభావం పడిన వారే అధికంగా ఉన్నారు. కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్‌ 30ని గడువుగా తీసుకుని..ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి. 

సుదీర్‌బాబు 2018 ఏప్రిల్‌ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్‌లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్‌ చేసిన ఆయన ఐజీగా పదోన్నది పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడాది డిసెంబర్‌ 13న రాచకొండ పోలీసు కమిషనర్‌గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్‌లో మూడేళ్లు పనిచేసిన జాబితాలో సుధీర్‌ బాబు ఉన్నారు. దీంతో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్‌ జోషిని కొత్త సీపీగా నియమించింది. 

గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఈయనకు ఉంది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో కీలక పోస్టింగ్‌లతో పాటు వరంగల్‌ సీపీగానూ పని చేశారు. కోడ్‌ ఎఫెక్ట్‌తోనే ఈస్ట్‌జోన్‌ డీసీపీ బి.సాయి శ్రీ సైతం బదిలీ కాగా..ఆ స్థానంలో మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ డీసీపీగా పని చేస్తున్న ఆర్‌.గిరిధర్‌ నియమితులయ్యారు. గద్వాల డీఐజీగా ఉన్న డి.జోయల్‌ డెవిస్‌ను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా నియమించింది. ఈయన ఇటీవల జరిగిన బదిలీల వరకు వెస్ట్‌ జోన్‌ డీసీపీగా, ఆపై సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా పని చేశారు. ట్రాన్స్‌కోలో పని చేస్తున్న డి.ఉదయ్‌కుమార్‌ రెడ్డిని సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా, ఎస్‌.రష్మీ పెరుమాళ్‌ను హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ డీసీపీగా ప్రభుత్వం నియమించింది. 

డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ యూఎల్‌సీలో పనిచేస్తున్న కె.వెంకట ఉపేందర్‌రెడ్డి రాజేంద్రనగర్‌ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. కీసర ఆర్డీవోగా రమాదేవి, శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డిలకు పోస్టింగ్‌ లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement