Ganesh Chaturthi 2022: ఏకశిలలో భారీ ఏకదంతుడు

Tallest Monolithic Ganesha Statue In Nagarkurnool District - Sakshi

నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలంలో 26 అడుగుల విగ్రహం 

పశ్చిమ చాళుక్యుల కాలం నాటి భారీ గణనాథుడు 

ఆలయం లేక నిరాదరణ 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఇది దేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడి విగ్రహం. ఇది నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. దుందుభి వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉన్న గోమఠేశ్వరుడు, చాముండీ కొండపై నందీశ్వరుడితోపాటు ఆవంచలోని గణపతి ఏకశిలా విగ్రహాలుగా అతిపెద్దవిగా ప్రసిద్ధి. ఏటా వినాయక చవితి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే ఈ గణనాథుడికి ఆలయం లేదు.  

నాటి ఆవుల మంచాపురమే.. నేటి ఆవంచ..  
పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేక మల్లుడు, భువనైక మల్లుడు, తైలోక్య మల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్ష్యాకులు గణపతి భక్తులు కావడంతో క్రీ.శ.12వ శతాబ్దంలో 26 అడుగుల ఎత్తైన ఏకశిలా గణపతిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.

పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియం వద్ద భద్రపర్చారు. వీరి కాలంలోనే గ్రామశివారులోని భైరవ ఆలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివ పంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది.  

ఆదరణ లేక పూజలందుకోని గణనాథుడు 
దేశంలోనే అతిపెద్ద వినాయక ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య గణపతికి నీడ లేకుండాపోయింది. ఆలయం నిర్మాణం జరగకపోవడంతో ఈ విగ్రహం వందల ఏళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తోంది. ఏడేళ్ల క్రితం ఓ చారిటబుల్‌ ట్రస్టు ఆలయం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే ఆలయ నిర్మాణపనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

ప్రభుత్వం దృష్టిసారించాలి.. 
పురాతన కాలం నాటి ఏకశిలా వినాయక విగ్రహానికి ఆలయాన్ని నిర్మించాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు ఆలయం లేక గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుడిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.  
– వస్పతి శివలింగం, ఆవంచ, నాగర్‌కర్నూల్‌ జిల్లా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top