
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) ఊరట దక్కింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టుకు(Telangana High Court) వెళ్లి తేల్చుకోవాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. పిటిషనర్‌కు సూచించింది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంలో గోపాల్ రెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందన్న పిటిషనర్ తరఫు లాయర్ వివరణ ఇచ్చారు. అనంతరం, ధర్మాసనం రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టుకే వెళ్లాలని ఆదేశించింది. దీంతో, పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు చెప్పడంతో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది అంగీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది.
అంతకుముందు.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్‌లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్‌ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్‌లో తెలిపారు.