నేటి నుంచి భగభగలు.. 43 డిగ్రీల వరకు? జాగ్రత్తలు తప్పనిసరి

Summer Temperatures up to 43 degrees are likely to be recorded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. కొన్నిచోట్ల 40 డిగ్రీల సెల్సియస్‌ నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 

నేడు బంగాళాఖాతంలో తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. ఇది బుధవారం నాటికి అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. ఇది 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుంది.

ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. అదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి వాయుగుండం ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి, సత్యసాయి జిల్లా నల్లమడ, మడకశిరలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో వేడి తాళలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని 28 మండలాల్లో బుధవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఆయా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

తెలంగాణలో మంగళవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు
కేంద్రం            ఉష్ణోగ్రత
నల్లగొండ            40.5
ఆదిలాబాద్‌         40.0
రామగుండం       39.6
ఖమ్మం               39.4
భద్రాచలం         38.2
హనుమకొండ      38.0
మెదక్‌                 37.8
నిజామాబాద్‌       37.4
హైదరాబాద్‌       36.7    
మహబూబ్‌నగర్‌ 35.8  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top