వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన

Students Protest Demands To Remove Vice Chancellor Ravinder Gupta - Sakshi

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించని వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తాను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండోరోజు కొనసాగింది. క్యాంపస్‌ మెయిన్‌ గేట్‌ వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా చేశారు. వీసీ రవీందర్‌ ప్రస్తుత రిజిస్ట్రార్‌ కె.శివశంకర్‌ స్థానంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా బి.విద్యావర్ధినిని నియమిస్తున్నట్లు తెలియడంతో ర్యాలీగా వెళ్లి వీసీ నివాసాన్ని ముట్టడించారు.

తమ అందోళనను పక్కదారి పట్టించేందుకు రిజిస్ట్రార్‌ను మార్చారని ఆరోపించారు. వీసీ బయటకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో వీసీ రవీందర్‌ బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. నూతన బాలికల హాస్టల్, ఆడిటోరియం నిర్మాణం అంశాలు తన చేతుల్లో లేవని, మిగతా సమస్యలను వారం, పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే తమ అందోళనను పక్కదారి పట్టించేందుకే రిజిస్ట్రార్‌ను మార్చారని, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ విద్యావర్ధినిని తొలగించాలని, వీసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

దీంతో విద్యార్థుల తీరుపై వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకడమిక్, అడ్మిన్‌ నియామకాల విషయంలో విద్యార్థులు ప్రశ్నించకూడదని, చదువుపై దృష్టి పెట్టాలని పేర్కొని ఇంట్లోకి వెళ్లిపోయారు. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చిన వీసీకి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో వార్షికోత్సవం నిర్వహించాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామన్న వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి హాస్టళ్లకు తిరిగి వెళ్లారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top