వీధి కుక్కల వీరంగం.. బయటకు వెళ్లాలంటే వణికిపోతున్న జనాలు

Stray Dogs Become Threat To People In Hyderabad Huge Number In City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో కుక్కుకాటు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కుక్కలు చెలరేగిపోతున్నాయి. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే వారిని భయంకరంగా కరుస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తరచుగా కుక్కలు దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లల్ని ఆడుకోడానికి పంపించాలన్నా వెనకడుగు వేస్తున్నారు. 

భాగ్యనగరంలో భయపెడుతున్న వీధికుక్కలు
తాజాగా అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తండ్రితో కలిసి సరాదాగా బయటకు వెళ్లిన ప్రదీప్‌ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలను చూసి భయపడిన పరుగెత్తిన బాలుడిని వెంటపడీ మరి ఒళ్లంతా తీవ్రంగా గాయపరిచాయి. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు నగరంలోని పలుచోట్లు ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. చిన్నారులపై వీధికుక్కలు మూకుమ్మడి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.

2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో ఎనిమిదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 2020 ఆగష్టు 25న లంగర్‌హౌజ్‌లో నలుగురు చిన్నారులను కుక్కలు విచక్షణరహితంగా కరిచాయి. 2021 జనవరి 30న పాతబస్తీ బహదూర్‌పురాలో బాలుడిపై దాడిచేసిన శనకాలు అతడు ప్రాణాలు విడిచే వరకు వదిలిపెట్టలేదు. 2022 డిసెంబర్‌ 12న ఫిర్జాదిగూడలో కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే వీధి కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు  కుక్కల బెడదను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల కాకి లెక్కలు!
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఒక కోటి 30 లక్షల మంది జనాభా ఉండగా.. మొత్తం కుక్కలు 13 లక్షలు ఉన్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశామని లెక్కల్లో చూపుతూ 50 కోట్ల రూపాయలను జీహెచ్‌ఎంసీ , శివారు మున్సిపాల్టీల అధికారులు మింగేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 

ఒక్కో శునకం కుటుంబ నియంత్రణ కోసం రూ. 1,500 ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలో చూపుతున్నారు. ప్రతి రోజు 200 కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నామంటున్నారు. అయితే కాకి లెక్కలు చెబుతూ అధికారులు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తున్నాయి.

మరోవైపు అధికారుల లెక్కలు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 లక్షల 61 వేల కుక్కలు ఉన్నాయని, వాటిలో 75 శాతం కుక్కలు అంటే 3 లక్షల 20 వేల కుక్కలకు స్టేరలైజేషన్ పూర్తి చేశామని బల్దియా వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. బల్దియాతో పాటు 5 ప్రైవేట్ ఏజన్సీలతో కుక్కల ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

ఒక్కో కుక్కకు రూ. 1, 500 ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 యానిమల్ కేర్ సెంటర్లు ఉన్నాయని ప్రతి రోజు 200 కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు. కంప్లయింట్‌ వచ్చిన చోటుకు వెళ్లి కుక్కను తీసుకువచ్చి ఆపరేషన్ చేస్తున్నామని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top