మరో సంచలన పోరుకు డా. శివరంజని : ప్రజారోగ్యం కోసం సంతకం చేద్దాం! | stop misleading claims sign and support Dr Sivaranjani | Sakshi
Sakshi News home page

మరో సంచలన పోరుకు డా. శివరంజని : ప్రజారోగ్యం కోసం సంతకం చేద్దాం!

Apr 21 2026 3:39 PM | Updated on Apr 21 2026 4:52 PM

stop misleading claims sign and support Dr Sivaranjani

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ పరిచయం అవసరం లేని పేరు. ఓఆర్‌ఎస్ (Oral Rehydration Solution-ORS)  పేరుతో,  హై షుగర్‌ ఉన్న ఫేక్‌ ఓఆర్‌ఎస్‌ విక్రయాలకు వ్యతిరేకంగా 8 ఏళ్లపాటు అలుపెరగని పోరు  సల్పి, వాటి అమ్మకాలను నిలిపివేయించిన వైద్యురాలిగా అందరికీ సుపరిచితం. చిన్న పిల్లల వైద్యురాలిగా వృత్తిపరమైన నిబద్ధతను, చిన్నపిల్లల ఆరోగ్యంపై తనకున్న ప్రేమను చాటుకున్న తీరు అందరి మనసులను దోచుకుంది. 

అయితే ఈ మొత్తం వ్యవహారంపై  గుర్రుగా ఉన్న కొన్ని ప్రధానమైన ఫార్మా కంపెనీలు  ఇటీవల డాక్టర్ శివరంజని సంతోష్‌కు లీగల్ నోటీసులు ఇచ్చాయి. ఈ విషయంలో ఆమె మరోసారి ఉద్యమానికి దిగారు. కార్పొరేట్ కంపెనీల తప్పుడు మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా వైద్యులు, ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. 

ఫార్మసీలలో eRZLను ORSLకు కొనసాగింపుగా లేదా ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ ,ప్రచారం చేస్తున్న తీరుపై డా. శివరంజని  ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఆందోళనలను లేవనెత్తినిందుకు తనకు  జాన్సన్ & జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ , కెన్‌వ్యూ నుండి ఒక లీగల్ నోటీసు అందిందని తెలిపారు.   ఈ నేపథ్యంలో  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సంతకాల  సేకరణ చేపట్టారు. తన ఈ పిటిషన్‌ ఎవరితోనో గొడవ పడటానికి కాదు;  ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.

 eRZL అనేది  ORSLకు కొత్త రూపం తప్ప మరొకటి కాదని ఇది ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు విరుద్ధమని  స్పష్టం చేస్తున్నారు. ఈ పోరాటం eRZL సురక్షితమైనదా కాదా అనే దాని గురించి మాత్రమే కాదు. ఇది ఆ ఉత్పత్తిని మార్కెట్‌లో ఎలా ప్రదర్శిస్తున్నారు, ప్రజలు దానిని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాని గురించి కూడా అన్నారామె.

ఈ పిటిషన్  దేనికి అనేదానిపై ఆమె  వివరణ

  • ఆరోగ్య సంరక్షణ సమాచారంలో స్పష్టత

  • వినియోగదారులలో గందరగోళాన్ని నివారించడం

  • బాధ్యతాయుతమైన బ్రాండింగ్ , ప్రకటనలను నిర్ధారించడం

  • ప్రజారోగ్య సమస్యలను వైద్యులు సంకోచం లేకుండా లేవనెత్తడానికి అనుమతించడం

 

ఆమె లేవనెత్తిన ప్రధాన అంశాలు

  • eRZL తన ప్రచారంలో ORSL పేరును ప్రస్తావించకూడదు. ఎందుకంటే ORSL అనేది అసలైన వైద్య సిఫార్సు చేయబడిన ORS కాదు.

  • eRZLను ORSL కు కొనసాగింపుగా చూపడం వల్ల, తల్లిదండ్రులు దీనిని వైద్యపరమైన ORS అని పొరబడే అవకాశం ఉంది. ఇది నియంత్రణ సంస్థల చర్యల ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తుంది.

  • ఒత్తిడిలో ఉన్న తల్లిదండ్రులు ఫార్మసీలలో తెలిసిన పేర్లను చూసి త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. eRZL బ్రాండింగ్ వల్ల అది ఒక మెడికల్ సొల్యూషన్ అని వారు నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆ పాత పేరుతో ఎలాంటి సంబంధం లేకుండా దీనిని రీబ్రాండ్ చేయాలి.

  • మెడికల్ షాపుల్లో వీటి అమ్మకాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలి.

  • అలాగే వైద్యులు సిఫార్సు చేసే ORS కు, ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు మధ్య స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలి.

  • ప్రజారోగ్యం కోసం గొంతెత్తే ఆరోగ్య నిపుణులకు రక్షణ కల్పించాలి.

  • వైద్యరంగంలో చిన్న గందరగోళం కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తుంది. సరైన సమాచారం ప్రాణాలను కాపాడుతుంది.

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, పిల్లలలో 'సుక్రలోజ్' (sucralose) వంటి పదార్థాల వాడకంపై ఆందోళనలు ఉన్నాయి. అందుకే స్పష్టమైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.


ప్రజారోగ్యం కోసం అండగా నిలవండి. క్లిష్ట సమయాల్లో ప్రతి కుటుంబం సరైన నిర్ణయం తీసుకునేలా చూడటానికి ఈ పిటిషన్‌పై సంతకం చేయండి  దీనిని అందరికీ షేర్ చేయండి అంటూ  ఆమె ఎక్స్‌లో లింక్‌ను షేర్‌ చేశారు.

 

ప్రజారోగ్యం కోసం సంతకం పెట్టడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Advertisement
 
Advertisement
Advertisement