జూనియర్‌ డాక్టర్ల స్టైపెండ్‌ పెంపు | Stipend increase for junior doctors | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్ల స్టైపెండ్‌ పెంపు

Jun 30 2025 2:44 AM | Updated on Jun 30 2025 2:44 AM

Stipend increase for junior doctors

15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు  

బకాయిలు సైతం చెల్లించేలా ఆదేశాలు 

మంత్రి దామోదర చర్చలు సఫలం ..సమ్మె ప్రతిపాదనను విరమించుకున్న జూడాలు 

సాక్షి, హైదరాబాద్‌/సంగారెడ్డి : ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్, డెంటల్‌ కోర్సుల్లో ఇంటర్న్‌షి ప్‌ చేస్తున్న వైద్య విద్యార్థులతోపాటు పీజీ వైద్యవిద్య అభ్యసిస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్న్‌షి ప్‌ విద్యార్థులతోపాటు పీజీ డాక్టర్లు, సీనియర్‌ రెసిడెంట్ల స్టైపెండ్‌ను 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీవో 90ను విడుదల చేసూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ ఉత్వర్వులిచ్చారు. 

మరోవైపు పెంచిన స్టైపెండ్స్‌ను ఇకపై ప్రతి నెలా 10వ తేదీన చెల్లించాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ఈ మేరకు సంవత్సరానికి సరిపడా స్టైపెండ్స్‌ చెల్లించేందుకు అవసరమైన బీఆర్‌వోను (బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌) అధికారులు విడుదల చేశారు. పెండింగ్‌ స్టైపెండ్‌ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.  

పెరగనున్న స్టైపెండ్‌ 
ప్రస్తుతం హౌస్‌సర్జన్‌ (మెడికల్, డెంటల్‌)కు ప్రతినెలా రూ.25,906 స్టైపెండ్‌ ఉండగా, ఇక నుంచి ప్రతినెలా రూ.29,792 అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్‌ ఇయర్‌లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ.67,032, సెకండ్‌ ఇయర్‌లో రూ.61,528 ఉండగా, ఇక నుంచి రూ.70,757, ఫైనల్‌ ఇయర్‌లో రూ.64,767 ఉండగా, ఇప్పటి నుంచి రూ. 74,482 స్టైపెండ్‌ ఆయా మెడికోలకు అందనున్నది.  

పీజీ డిప్లమో విద్యార్థులకు ఫస్ట్‌ ఇయర్‌లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ.67,032 స్టైపెండ్‌ రానున్నది. సెకండ్‌ ఇయర్‌లో రూ.61,528 ఉండగా, ఇక నుంచి రూ. 70,757 చొప్పున స్టైపెండ్‌ రానున్నది.  

సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లకు రూ.లక్ష పైనే.. 
మరోవైపు సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లకు ఫస్ట్‌ ఇయర్‌లో రూ.92575 ఉండగా, అది రూ. 1,06,461కి పెరిగింది. సెకండ్‌ ఇయర్‌లో రూ. 97,204 ఉండగా, ఇక నుంచి రూ.1,11,785 అందనుంది. థర్డ్‌ ఇయర్‌లో రూ.1,01,829 ఉండగా, ఇక నుంచి రూ, 1,17,103కి చేరనున్నది. ఎండీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ. 67,032 ఇవ్వనున్నారు.

సెకండ్‌ ఇయర్‌లో రూ. 61,528 ఉండగా, ఇక నుంచి రూ, 70,757, థర్డ్‌ ఇయర్‌లో రూ.64,767 ఉండగా, ఇక నుంచి రూ.74,482కి పెరగనున్నది. సీనియర్‌ రెసిడెంట్స్‌కు రూ.92,575 ఇక నుంచి రూ.1,06,461 చేరనున్నది. ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని విద్యార్థులు తమకు కనీస స్టైపెండ్‌ కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల వద్ద ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.  

జూడాలతో చర్చలు సఫలం
జూనియర్‌ డాక్టర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సంగారెడ్డిలోని తన నివాసానికి జూడాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించారు. జూడాల డిమాండ్లను దశల వారీగా నెరవేరుస్తామని మంత్రి స్పష్టం చేయడంతో వారు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జూడాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అజయ్‌ కుమార్, జూడాల రాష్ట్ర అధ్యక్షుడు ఐజాక్‌ న్యూటన్, డాక్టర్లు కీర్తన ,గిరిప్రసాద్, సందీప్, అవినాశ్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement