
మత్తు ముఠాలపై వరుస దాడులు
స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న స్పెషల్ టీం
మత్తు పదార్థాల స్వాదీనం.. నిందితుల ఆస్తుల జప్తు
తాజాగా సంగారెడ్డిలో ఆ్రల్ఫాజోలం విక్రయ ముఠాకు చెందిన రూ.30 కోట్ల ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి రావాలని, తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలున్నా కనిపెట్టేలా ‘ఈగల్’రంగంలోకి దిగుతుందని అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇకపై ఈగల్ (ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)గా మారుస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండడంతో డ్రగ్స్ కట్టడిపై ‘ఈగల్’(ఈగల్ అంటే ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)మరింత ఫోకస్ పెంచింది.
రాష్ట్రస్థాయిలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాల కట్టడికి స్థానిక పోలీసు బృందాలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. మత్తు ముఠాల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే వ్యూహాలతో ఈగల్ ముందుకు వెళ్తోంది. ఆ్రల్ఫాజోలం విక్రయ ముఠా సభ్యులకు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డిలో ఆల్ఫ్రాజోలం ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులకు చెందిన రూ.30 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 68 (ఎఫ్)కింద జప్తు చేశారు.
టెక్నాలజీతో డేగకన్ను
ఈగల్ టీం వద్ద ఉన్న సాంకేతికత.. దేశంలోని మరే పోలీస్‌శాఖ విభాగం వద్ద లేదని, తాము అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నట్టు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేస్తున్నారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్ వాడుతూ మాదకద్రవ్యాల సరఫరాదారులే లక్ష్యంగా డేటాబేస్ రూపొందిస్తున్నారు. దీంతో ఆయా మాదకద్రవ్యాల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కనుగొనే అవకాశాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, డార్క్ వెబ్‌తో సహా గోవా, బెంగళూరు, ముంబై లాంటి నగరాల నుంచి హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
గంజాయి, సింథటిక్ డ్రగ్స్ స్మగర్లు, కొరియర్ల నుంచి స్వా«దీనం చేసుకునే సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి.. ఆయా ముఠాలకు సంబంధించి స్మగ్లర్ల ప్రొఫైల్‌ను తయారు చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్ లాంటి కేంద్ర సంస్థలు సహా ఏపీ, ఒడిశా, గోవా పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లను నిర్వహించనున్నారు. ఇతర మత్తు పదార్థాలతో పోలిస్తే.. ఇటీవల ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు గంజాయి విక్రయాలు విస్తరించాయి. గంజాయిపైనా స్థానికపోలీసులతో కలిసి ఈగల్ టీంలు సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.
సాంకేతికతను వినియోగిస్తున్న ప్రత్యేక బృందాలు డ్రగ్స్ నెట్‌వర్క్ రాష్ట్ర సరిహద్దుల నుంచి సప్లై చైన్ వరకు ఎలా విస్తరిస్తుందో పక్కాగా నిఘా సమాచారం వచ్చిన తర్వాతే క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తుండటంతో విజయాల శాతం పెరుగుతోంది. ప్రధానంగా ఏపీ, ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న గంజాయికి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. ఈగల్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను రంగంలోకి దింపేందుకు చర్యలు ప్రా రంభమయ్యాయి. డ్రగ్స్. గంజాయి కేసు ల్లో పట్టుబడిన పాత నేరస్తులు, కస్టమర్ల డేటా ఆధారంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
సరిహద్దుల నుంచి రాకుండా కట్టడి..
రాష్ట్ర పరిధిలో స్పెషల్ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్న ప్రాంతాల్లోనూ డెకాయి ఆపరేషన్లు నిర్వహించడం, మాటు వేసి మత్తు ముఠాల గుట్టు కనిపెట్టడంలోనూ ఈగల్ బృందాలు విజయవంతమవుతున్నాయి. ఇటీవల ఇదే తరహాలో గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ.. హైదరాబాద్‌కు కొకైన్ సప్లయ్ చేస్తున్న డీజే వనిష్ టక్కర్, సప్లయర్ బాలకృష్ణను ఇటీవల అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. అధికారులు గోవాలో ఇటీవలే సోదాలు నిర్వహించడం తెలిసిందే.
గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు పనిచేస్తున్నట్టు పక్కా సమాచారం సేకరించిన తర్వాత.. డ్రగ్స్ కింగ్‌పిన్‌గా భావిస్తున్న మ్యాక్స్ నెట్‌వర్క్‌లోని హవాలా వ్యాపారులు ఉత్తమ్ సింగ్, రాజు సింగ్, మహేందర్ ప్రజాపతిలను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి రూ.49.65 లక్షలు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నైజీరియన్‌ను అరెస్ట్ చేసి రూ.1.64 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఇలా అంతర్రాష్ట్ర ఆపరేషన్లలోనూ దూకుడుగా వెళ్తున్నారు.