ఫొటో షూట్‌.. లోకల్‌ స్పాట్‌ 

Special Story On Pre Wedding Photo Shoot - Sakshi

‘ప్రీ వెడ్డింగ్‌’ ట్రెండ్‌ 

పెళ్లికి ముందు ఫొటోషూట్‌కు ఇష్టపడుతున్న యువత

నగర శివారుల్లో  ఔట్‌డోర్‌ లొకేషన్లు 

ఆతిథ్యమిస్తున్న రిసార్ట్స్, ఫాంహౌస్‌లు

భారీగా ఖర్చుపెడుతున్న నిర్వాహకులు 

ఒకప్పుడు పెళ్లి వేడుకకు సంబందించి ఫొటోలు, వీడియోలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పెళ్లికి ముందే జంటలు ‘ప్రీ వెడ్డింగ్‌’ ఫొటోషూట్‌ తీయించుకుంటున్నారు. ప్రస్తుతం ఫొటోషూట్‌కు విపరీతమైన క్రేజీ పెరిగింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు అంతటా విస్తరించింది. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు నచ్చి నిశ్చితార్థం జరిగిందంటే చాలు.. ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లకు సిద్ధమవుతున్నారు. ఫొటో, వీడియోగ్రాఫర్లను తీసుకుని తమకు ఇష్టమైన స్పాట్‌లకు వెళ్లి అందమైన కాస్టూమ్‌తో నచ్చే  విధంగా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. వీటికి సినీ, జానపద పాటలను కూడా కలుపుతున్నారు. ఇందుకోసం వేలు, లక్షల్లో డబ్బు ఖర్చుపెడుతున్నారు. నగర శివార్లలోని రిసార్ట్స్‌లు, దేవాలయాలు, పార్కులు, ఫాంహౌస్‌లు, లేక్‌లు ఫొటోషూట్‌కు ఔట్‌డోర్‌ లొకేషన్లుగా మారాయి.

మాయాబజార్‌లో ఓ జంట స్టిల్‌..     

శంషాబాద్, మొయినాబాద్‌: నగర శివారు ప్రాంతాలు ఫొటోషూట్‌ స్పాట్స్‌గా మారాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంషాబాద్, గండిపేట, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, మేడ్చల్‌ తదితర మండలాల్లోని రిసార్ట్స్, టెంపుల్స్, ఫాంహౌస్‌లు, పార్కులు, లేక్‌లలో ఫొటోషూట్‌లు అధికంగా జరుగుతున్నాయి. ప్రధానంగా మొయినాబాద్‌ మండలంలోని మృగవనితో పాటు మరో రెండు రిసార్ట్స్, మృగవని పార్కు, చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో గండిపేట చెరువు, హిమాయత్‌సాగర్‌ చెరువు, పలు ఫాంహౌస్‌లు, శంషాబాద్‌ మండలంలోని అమ్మపల్లి దేవాలయం, గండిపేట, గోల్కొండ సమీప ప్రాంతాలు ఇందుకు వేదికగా మారాయి. అదేవిధంగా మహేశ్వరం మండలంలోని వండర్‌లా, కీసర మండలంలోని కీసరగుట్ట ఆలయం, శామీర్‌పేట మండలంలోని పలు రిసార్ట్‌లు, శామీర్‌పేట పెద్ద చెరువు ఫొటోషూట్‌ స్పాట్స్‌గా నిలుస్తున్నాయి.


మాయాబజార్‌లో జంట సందడి  

స్పెషల్‌గా ‘మాయాబజార్‌’
సినీ షూటింగ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే శంషాబాద్‌ ఇప్పుడు ఇలాంటి వేడుకలకు సంబంధించిన షూటింగ్‌లలో కూడా అగ్రస్థానంలోనే ఉంది. పట్టణంలోని ఫోర్ట్‌గ్రాండ్‌.. సిద్దులగుట్ట దేవాలయం, అమ్మపల్లి దేవాలయం పరిసరాల్లో ఫొటోషూట్‌లు జరుగుతున్నాయి.  నర్కూడ సమీపంలో ఏర్పాటు చేసిన ‘మాయాబజార్‌’.. ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్, పుట్టినరోజు, సీమంతాలు తదితర షూటింగ్‌ల కోసం ఇద్దరు మహిళల నిర్వహణలో కొనసాగుతోంది. ఇందులో 20 ఔట్‌డోర్, ఇండోర్‌ లొకేషన్లను అందంగా తీర్చిదిద్దారు.

సినిమా షూటింగ్‌లతో పాటు ప్రముఖుల వివాహవేడుకలకు కన్వెన్షన్‌గా ఉన్న ఫోర్ట్‌గ్రాండ్‌లో ఈ షూటింగ్‌లు కొనసాగుతున్నాయి. మొఘల్‌ శైలిలో నిర్మాణం చేసిన ఈ కోట అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ సినిమాలకు సెంటిమెంట్‌గా ఉన్న అమ్మపల్లి దేవాలయంలో కోనేరు పరిసరాలో ఇలాంటి షూటింగ్‌లు నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ చిత్రీకరణ జరిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమంతో పాటు బంధువులు, స్నేహితుల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో వివిధ జిల్లాలతో పాటు బయటి రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఎంతో ఆసక్తితో ఇక్కడ ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్‌ తీయించుకుంటున్నారు. ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదు.
 

ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెరిగిన డిమాండ్‌.. 
యువతలో ఫొటోషూట్‌లకు క్రేజీ పెరగడంతో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్‌ పెరిగింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు బిజీ అవుతున్నారు. గతంలో పెళ్లి సమయంలోనే ఫొటోలు, వీడియోలు తీసేపని ఉండేది. కానీ, ఇప్పుడు పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్, పెళ్లి సమయంలో, పెళ్లి తరువాత కూడా ఫొటోషూట్‌ తీయిస్తుండడంతో వారికి పని పెరిగిపోయింది.
 

శివారుల్లోనే మంచి లొకేషన్లు 
ఫొటోషూట్‌లకు నగర శివారు ప్రాంతాల్లోనే మంచి లొకేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలోనే చాలా రిసార్ట్స్‌లు, చెరువులు, టెంపుల్స్, ఫాంహౌస్‌లు, పార్కులు ఉండటంతో వాటిలోనే చాలా ఫొటోషూట్‌లు చేస్తున్నాము. యువత ఆసక్తిని బట్టి లొకేషన్లు మారుస్తుంటాము.
– నందు, వీడియోగ్రాఫర్‌ 

కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు..
ఫొటోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పెళ్లికే ప్రాధాన్యత ఇచ్చి ఫొటోలు, వీడియోలు తీయించుకునేవారు. కానీ, ఇప్పుడు పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా తమకు నచ్చిన విధంగా ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇప్పుడు యువత కొత్తదనాన్ని కోరుకుంటోంది. అందుకు అనుగుణంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలోనూ మార్పులు వచ్చాయి. 
– రమేష్‌గౌడ్, ఫొటోగ్రాఫర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top