దేశంలోనే తెలంగాణ నం.1 | Sakshi
Sakshi News home page

దేశంలోనే తెలంగాణ నం.1

Published Fri, Jan 27 2023 1:24 AM

Speaker Pocharam Srinivas Reddy Hoists National Flag In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శాసన మండలి ఆవరణలో గుత్తా, శాసనసభ ఆవరణలో పోచారం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ: స్పీకర్‌
కులమతాలకు అతీతంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి జరుపు కునే పండుగ గణతంత్ర దినోత్సవమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాంతియుతంగా తెచ్చిన స్వాతంత్య్ర ఫలాలను పరిపాలన ద్వారా అమలు చేసే విధులు, బాధ్యతలను  పవిత్రమైన రాజ్యాంగం తెలియజేసిందన్నారు.

తెలంగాణ భవన్‌లో..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌ లో పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

టీటీడీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ 
భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అట్లూరి సుబ్బారావు, ఆజ్మీరా రాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆప్‌ కార్యాలయంలో జెండా వందనం 
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆప్‌ కోర్‌ కమిటీ సభ్యురాలు ఇందిరా శోభన్‌ ఎగురవేశారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement