Timber Smuggling: కలపకు కాళ్లు ! .. నదుల మీదుగా

Smugglers Smuggling Timber Worth Millions of Rupees at Bhupalapalli - Sakshi

విలువైన వృక్ష సంపద మాయం

వంతెనల మీదుగా రవాణా

గోదావరి నుంచి అప్పుడప్పుడు తరలింపు

ఫారెస్టు చెక్‌పోస్టుల ఏర్పాటులో జాప్యం

రూ.లక్షల్లో సొమ్ముచేసుకుంటున్న స్మగ్లర్లు

ఒకప్పుడు దండకారణ్యంగా ఉన్న మహదేవపూర్‌ అడవులు ప్రస్తుతం పలుచబడ్డాయి. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న కలప రవాణా మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి తెలంగాణకు కలప అక్రమంగా తరలివస్తుంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కలపకు కాళ్లు వచ్చాయనే చందంగా తయారైంది. ఆయా రాష్ట్రాల నుంచి విలువైన వృక్ష సంపద కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం వంతెనల మీదుగా తెలంగాణలోని భూపాలపల్లి, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల పట్టణాలకు యథేచ్ఛగా తరలిపోతున్నట్లు తెలిసింది. రూ.లక్షల్లో వ్యాపారం సాగుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. కానీ ఎక్కడా అటవీశాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో అక్కమార్కులకు ఆడిందే ఆట పాడిండే పాటగా తయారైందని విమర్శలు ఉన్నాయి. – కాళేశ్వరం

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో విలువైన టేకు వృక్ష సంపద అపారంగా ఉంది. కానీ అక్కడ విలువ తక్కువగా ఉండడంతో అక్రమార్కులు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల సరిహద్దుల నుంచి కలప వ్యాపారం జోరుగా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన మీదుగా రాత్రి వేళల్లో కలప తరలివస్తుంది. అవతలి వైపు సిరొంచ వద్ద మహారాష్ట్ర చెక్‌పోస్టు ఉంది. అక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకొని కలపను టాటా ఏసీ, వ్యాను, లారీల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ మీదుగా కలప తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ రెండు వంతెనలు దాటి అన్నారం బ్యారేజీ మీదుగా కలప పట్టణాలకు తరలిపోతుంది. కానీ ఎక్కడా ఈ మూడు వంతెనల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం రూ.లక్షల విలువైన టేకు తరలిపోతుందని తెలిసింది. రాత్రి వేళల్లో నిఘా తగ్గడంతో.. ఇలా కలప వ్యాపారం జరుగుతున్నా అధికారులు అటువైపు చూడడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలలో సిరొంచ వద్ద తెలంగాణలోని కొంత మంది స్మగ్లర్లు కొన్ని సందర్భాల్లో టాటా ఏసీ వాహనాల్లో తరలిస్తూ లక్షల విలువైన కలపతో అక్కడి అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు.
 
తెలంగాణలో ఇళ్ల నిర్మాణం..
తెలంగాణ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. దానికి అనుగుణంగా గృహాల యజమానులు కలపను కొనుగోలు చేస్తున్నారు. కలప స్మగ్లర్లు రూ. 5–6వేల వరకు 6 ఫీట్ల పొడవు, ఆరు ఇంచుల వెడల్పు గల (దుంగ) కలపకు తీసుకొంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో రూ.2500–3200 వరకు కొనుగోలు చేస్తూ దండుకుంటున్నారు. ఇళ్లలో దర్వాజలు, తలుపులు, కిటికీలతో పాటు ఇంటికి సంబంధించి ఫర్నిచర్‌ కోసం కలపను తరలిస్తున్నారు.

మహదేవపూర్, పలిమెల మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగరీత్యా పనిచేసి బదిలీ అయ్యే సందర్భంలో కూడా లక్షల విలువైన పర్నిచర్‌ను తయారు చేయించుకొని అనుమతులు లేకుండా తరలిపోతున్నారు. వారిపైన కూడా నిఘా లేదని తెలిసింది. అటవీశాఖ అధికారులు మాత్రం కలపను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. వంతెనల వద్ద చెక్‌పోస్టుల ఏర్పాటులో జాప్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదని సామాన్య ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై మహదేవపూర్‌ ఎఫ్‌డీఓ వజ్రారెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా.. మా రేంజ్‌ పరిధిలో అటవీశాఖ సిబ్బంది లేరన్నారు. చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని పై అధికారులకు నివేదిక పంపాం. మహారాష్ట్ర నుంచి కలప వస్తే మా సిబ్బంది పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. 

నదుల మీదుగా..
అప్పుడప్పుడు వంతెనల నుంచి కాకుండా అధికారులను రూటు మార్చేందుకు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల మీదుగా టేకు తెప్పలుగా కట్టి తరలిస్తున్నారు. ఇలా తెప్పల ద్వారా తెచ్చిన కలపను పలిమెల, మహదేవపూర్, కాళేశ్వరం మండలాల నుంచి, అటు ఏటూరునాగారం మీదుగా కూడా ప్రైవేట్‌ వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తనిఖీల్లో దొరికేటివి కొన్ని మాత్రమే.. విలువైన టేకు మాత్రం అధికారుల కళ్లు గప్పి అందకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top