
నందలూరులో ఎర్రచందనం స్మగ్లర్లు
యథేచ్ఛగా దుంగల అక్రమ రవాణా
చిత్తూరులో పట్టుబడిన స్మగ్లర్..
తీగ లాగితే కదిలిన డొంక
పోలీసులు అదుపులో కొందరు, మరికొందరి కోసం గాలింపు
రాజంపేట: సోమశిల బ్యాక్‌వాటర్ ప్రాంతాలు పుష్పాలకు నిలయంగా మారాయి. తాజాగా పోలీసులు పట్టుకున్న స్మగ్లర్లు అన్నమయ్య జిల్లాలోని నందలూరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడాది మే 12న ఎర్రచందనం స్మగ్లింగ్‌లో తగ్గేదేలా శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఇప్పుడు ఈ కథనం నిజమనడానికి పోలీసుల అదుపులో ఉన్న పుష్పరాజ్‌లే నిదర్శనమని సోమశిల ముంపువాసులు చెబుతున్నారు. తీగలాగితే.. తీగలాగితే డొంక కదిలినట్లు చిత్తూరు జిల్లా పరిధిలో టాస్‌్కఫోర్స్ పోలీసులకు పట్టుబడిన ఓ స్మగ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు నందలూరులోని కొమ్మూరు, కోనాపురం, ఈదరపల్లె, నందలూరు, చాపలవారిపల్లె, చుక్కాయపల్లె, చింతకాయలపల్లె తదితర గ్రామాలకు చెందిన కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడుతున్నారు.
వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో టీడీపీకి చెందిన ఓ స్థానిక సంస్ధ ప్రజాప్రతినిధితోపాటు ఆపార్టీ సానుభూతి పరులు ఉన్నారని తెలుస్తోంది. స్మగ్లర్ల ఫోన్‌ల ద్వారా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వారే స్మగ్లర్లుగా ఉన్నారనే సమాచారంతో, ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెదవి విరుస్తున్నారు.
⇒ రాజంపేట మండలం బోయనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. అతనికి దాదాపు రూ.3కోట్ల పైగా ఆస్తి ఉంది. ఈ విధంగా నందలూరు మండలంలోని ముంపుగ్రామాలకు చెందిన వారు ఎర్రచందనంతో రూ. కోట్లు సంపాదించి, ఇతర ప్రాంతాల్లో రియల్ఎస్టేట్, ఇళ్లు, భూములును కొనుగోలు చేసి, స్థానికంగా మాసిపోయిన పంచలు, చొక్కాలతో కనిపిస్తున్నారు.
తిరుపతి, రేణిగుంటల్లో..
ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ముంపుగ్రామాలకు చెందిన కొందరు తిరుపతి, రేణిగుంట తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు, విలాసవంతమైన జీవితాలను గుడుపుతుండటం గమనార్హం. నందలూరులో ఎర్రచందంన స్మగ్లర్ల తాకిడి అధికం కావడానికి సోమశిల బ్యాక్‌వాటర్ కారణంగా చెప్పవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే కీ పర్సన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
గుట్టుచప్పుడుగా.. బ్యాక్ వాటర్‌లో..
సోమశిల బ్యాక్‌వాటర్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టుచప్పుడుగా కొనసాగుతోంది. అటవీశాఖ డీఎఫ్‌ఓగా శ్రీనివాసులరెడ్డి ఉన్నపుడు బ్యాక్‌వాటర్‌లో దాచిపెట్టిన ఎర్రదుంగలడంప్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అప్పట్లో ప్రత్యేక దృష్టి సారించి అడ్డుకట్టవేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడంలేదు. సోమశిల ముంపు గ్రామాలతోపాటు సమీప గ్రామాలకు చెందిన కొందరితో స్మగ్లింగ్ మళ్లీ యథేచ్ఛగా సాగుతోంది. అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా అటవీశాఖ చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలున్నాయి.
చేపలవేట ముసుగులో...
సోమశిల బ్యాక్‌వాటర్‌లో చేపల వేట ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. ముంపు గ్రామాలకు చెందిన ఇద్దరిని ఇటీవల ఇతర ప్రాంతంలో పట్టుకొని కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. అటవీ చెక్‌పోస్టులు ఉన్నా.. నామమాత్రమే అన్న విమర్శలు వెలువడుతున్నాయి.
ఈజీ మనీ కోసం..
ఈజీ మనీ కోసం కోనాపురం, కొమ్మూరు, చాపలవారిపల్లె, చుక్కాయపల్లె, ఈదరపల్లె, నందలూరు, చింతకాయపల్లె తదితర గ్రామాల యువకులు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అలవాటుపడుతున్నారు. జనజీవనం లేని ముంపు గ్రామాల్లో అర్ధరాత్రి వేళలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. నేరుగా బ్యాక్‌వాటర్ ఉన్న ప్రాంతాల వద్దకు చేరుకొని, అక్కడి నుంచి అక్రమరవాణా మొదలవుతుంది. అటవీశాఖ పట్టించుకోకపోవడం వల్లనే ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు అధికమయ్యారు.
ఐలాండ్‌గా పల్లాగట్టు..
పల్లాగట్టు ప్రాంతం 20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వెలుగులోకి రాని ఈ ఐలాండ్‌లో చట్టవ్యతిరేక కార్యకలపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు పల్లాగట్టును తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. గుండ్లమాడతోపాటు సోమశిల వెనుకజలాల వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి అక్రమరవాణాకు బ్యాక్‌వాటర్‌ను అడ్డాగా వాడుకుంటున్నారు. రోడ్డు మార్గం లేకపోవడంతో బ్యాక్‌వాటర్ ద్వారానే బాలెలో తరలించి పొత్తపి ద్వారా ఓబలికి తరలిస్తున్నారు.
జనసంచారంలేని ప్రాంతాలే టార్గెట్..
అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి వాటిని జనసంచారం లేని ముంపు గ్రామాల శివార్లకు చేర్చి, అక్కడి నుంచి అనుమానం రాకుండా అనుకున్న గమ్యాలకు తరలించేస్తున్నారు. గుట్టుచప్పుడుగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం గురించి ముంపుగ్రామాల్లో ఏ ఒక్కరిని కదిలించినా చెబుతారు. పల్లాగట్టు, గుండ్లమడలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి వాటిని నాటుబోట్లలో గట్టుకు చేర్చి అక్రమంగా మెయిన్‌రోడ్డుకు ఎక్కిస్తున్నారు.