ఆపద్బాంధవులకు అద్భుత శిక్షణ | Singareni is training State Disaster Response Force teams | Sakshi
Sakshi News home page

ఆపద్బాంధవులకు అద్భుత శిక్షణ

May 22 2025 4:21 AM | Updated on May 22 2025 4:21 AM

Singareni is training State Disaster Response Force teams

36 రోజులు.. 1,200 మంది 

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు కఠోర శిక్షణ  

రెస్క్యూ, ఫైర్‌ఫైటింగ్, రోప్‌ క్‌లైంబింగ్‌పై తర్ఫీదు 

తక్కువ సమయంలో ఎక్కువ మందిని కాపాడటమే లక్ష్యం 

గోదావరిఖని: ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనుసరించాల్సిన విధానంపై స్టేట్‌ డిజాస్టర్స్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలకు సింగరేణి శిక్షణ ఇస్తోంది. జల, వాయు, అగ్ని ప్రమాదాలతోపాటు.. బహుళ అంతస్తుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన సహాయక చర్యలపై సింగరేణి సంస్థ.. 36 రోజుల పాటు 1,200 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి శిక్షణ ప్రారంభించింది. వంద మందికి ఒక బృందం చొప్పున, మూడురోజులపాటు పలు అంశాలపై శిక్షణతోపాటు ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహిస్తోంది. 

ఇలా 36 రోజుల పాటు 12 బృందాలకు శిక్షణ ఇవ్వనుంది. నాలుగు నెలల క్రితమే రాష్ట్రంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజర్వ్‌ పోలీసు విభాగం నుంచి ఆసక్తి ఉన్న 1,200 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని 12 క్యాంప్‌ల్లో ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందించాల్సిన తీరు, ఆపత్కాలంలో తాము సురక్షితంగా ఉండి, ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం లక్ష్యంగా శిక్షణ కొనసాగుతోంది. 

ముందుగా ఇతర రాష్ట్రాల్లో కొన్ని బృందాలకు శిక్షణ ఇస్తున్నారు. కోయంబత్తూర్, విజయవాడ, పుణె, వడోధర, ఒడిశా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ద్వారా పలు అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కొక్క బృందానికి రెండు నెలల పాటు శిక్షణ కొనసాగుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో పలు అంశాలపై స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది. ముందుగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోట్లపై వెళ్లి.. నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత సింగరేణి రెస్క్యూ విభాగంతో శిక్షణ ఇస్తున్నారు.   

ఎస్‌ఎల్‌బీసీతో సింగరేణి రెస్క్యూపై నజర్‌ 
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంతో.. సింగరేణి రెస్క్యూ ప్రాధాన్యం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచి్చంది. సుమారు 40 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసే పనుల్లో సహాయ బృందాలు అందించిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏర్పాటైన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ విభాగానికి.. విపత్తుల సమయంలో స్పందించాల్సిన తీరుపై కఠోర శిక్షణ ఇస్తున్నారు. మొదటి బ్యాచ్‌లో డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన వంద మందికి శిక్షణ కొనసాగుతోంది.  

మూడు రోజుల ప్రత్యేక శిక్షణ 
ప్రకృతికి విరుద్ధంగా భూగర్భ గనుల్లోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడే విధానం, అగ్ని ప్రమాదాలు, విషవాయువులు ఏర్పడినప్పుడు ఎలాంటి పరికరాలు వినియోగించి.. ఎలా అదుపులోకి తీసుకురావాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ప్ర త్యక్షంగా చూపించారు. 

భవనం కూలిపోయినప్పుడు, అ గ్ని ప్రమాదాలకు గురైనప్పుడు సహాయక సిబ్బంది సురక్షితంగా ఉంటూ.. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సు రక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నారు. బుధవారంతో మొదటిబ్యాచ్‌ శిక్షణ పూర్తయింది. సింగరేణి అందించిన శిక్షణ భవిష్యత్‌లో చాలా ఉపయోగపడుతుందని విపత్తుల విభాగం సిబ్బంది పేర్కొన్నారు.

సంతోషంగా ఉంది  
అంతర్జాతీయ స్థాయి సామగ్రి సింగరేణి వద్ద ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.  – కె.రవీందర్,  ఆర్‌ఎస్‌ఐ, డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌

ఎలా రక్షించాలో తెలుసుకున్నాం..  
క్లిష్ట సమయాల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయక బృందం ఎలా వ్యవహరించాలనే విషయాలను తెలుసుకున్నాం. సకాలంలో స్పందించడంతో పాటు సురక్షితంగా ఉండి ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అందించిన శిక్షణ భవిష్యత్‌లో ఉపయోగ పడుతుంది. – బదావత్‌ రంజిత్‌కుమార్,హెడ్‌కానిస్టేబుల్

కళ్లకు కట్టినట్టు..
ఎత్తయిన భవనా ల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే తీరుపై కూలంకషంగా వివరించారు. ప్రమాదాల్లో చిక్కువారిని రక్షించడంతో పాటు.. మనం కూడా సురక్షితంగా బయటకు వచ్చే విధానం, మంటలను అదుపులోకి తెచ్చే తీరుతో పాటు పలు అంశాలపై కళ్లకు కట్టినట్లు వివరించారు.  – కె.రవి, ఏఎస్‌ఐ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ 

అంతర్జాతీయ ప్రమాణాలతో.. 
ప్రకృతి వైపరీత్యాలతో పాటు భూగర్భ గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన తీరుపై అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రంగా నిలుపుతాం. ఇప్పటికే కోలిండియాలోని అనేక సంస్థలకు సహాయ చర్యలపై శిక్షణ ఇచ్చాం. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలకు కూడా శిక్షణ ఇచ్చి.. సింగరేణి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతాం.  – ఎన్‌.బలరాం, సీఎండీ, సింగరేణి   

4 నెలల క్రితమే చేరా..  
నాలుగు నెలల క్రితం ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో చేరాను. ముందుగా హుస్సేన్‌సాగర్‌లో నీటిలో పడిపోయిన వారిని రక్షించే అంశంపై శిక్షణ ఇచ్చారు. సింగరేణి రెస్క్యూ ద్వారా అందించిన శిక్షణ చాలా బాగుంది.      – బీర్ల ఆనంద్,  కానిస్టేబుల్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement