సిద్దిపేట ‘శిల్ప’విలాపం! | Shilparamam work stopped midway | Sakshi
Sakshi News home page

సిద్దిపేట ‘శిల్ప’విలాపం!

Dec 22 2024 4:48 AM | Updated on Dec 22 2024 4:48 AM

Shilparamam work stopped midway

మధ్యలోనే ఆగిపోయిన శిల్పారామం పనులు 

పిల్లర్ల దశలోనే రంగనాయకసాగర్‌లో కాటేజీల నిర్మాణం 

ఏడాది కాలంగా నిలిచిపోయిన పర్యాటక అభివృద్ధి పనులు 

గత ప్రభుత్వ హయాంలోనే నిధుల కేటాయింపు 

సిద్దిపేట పర్యాటక నిర్మాణాల పూర్తిపై ఆసక్తిగా ఉన్న ప్రజలు

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా సిద్దిపేట ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి పర్యాటకంగా మరిన్ని సొబగులు అద్దేందుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించింది. కోమటి చెరువు దగ్గర శిల్పారామం, నెక్లెస్‌రోడ్‌ పనుల పూర్తి, రంగనాయకసాగర్‌ దగ్గర పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సంవత్సరం నుంచి ముందుకు సాగడం లేదు.   

పిల్లర్ల దశలోనే కాటేజీలు
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో 3 టీంఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తయారు చేసేందుకు రూ.100 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. నీటిలో తేలియాడే కాటేజీలు, వాటర్‌ షోలు, పెద్ద బంకెట్‌ హాల్‌ వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.

కాటేజీల నిర్మాణం పనులు పిల్లర్ల దశలోనే నిలిచి పోయాయి. ఇప్పటికే రంగనాయకసాగర్‌ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు, ప్రజలు ఎదురు చుస్తున్నారు. 



10 ఎకరాల్లో శిల్పారామం 
కోమటి చెరువు సమీపంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.23 కోట్లతో శిల్పారామం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా అలాగే చేనేత హస్తకళా ప్రదర్శన, పలు కుల వృత్తులకు చేయూతనందించేందుకు పనులను ఏప్రిల్, 2023లో ప్రారంభించారు. 

శిల్పారామం పనులు డిసెంబర్‌ 2023 వరకు వేగంగా సాగాయి. తర్వాత అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్రాఫ్ట్, మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ ఇలా అన్ని రకాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.  

నిలిచిన ఆర్టిఫిషియల్‌ బీచ్‌ 
సిద్దిపేట శిల్పారామంలో ఆర్టిఫిషియల్‌ బీచ్‌ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. బీచ్‌ నిర్మాణం పూర్తయితే సముద్రం బీచ్‌ దగ్గర పొందే అనుభూతి సిద్దిపేటలో లభిస్తుందని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆ పనులు కూడా నిలిచిపోయాయి. అలాగే కోమటి చెరువు నెక్లెస్‌రోడ్‌ పూర్తి నిర్మాణం కోసం రూ.15 కోట్లను కేటాయించారు. ఆ పనులూ ఆగిపోయాయి. 

సిద్దిపేటలో మహతి ఆడిటోరియం కోసం రూ.50 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ని«ధులు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తయ్యే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.  

కాంట్రాక్టర్లు తప్పుకున్నారు 
పలు పనులకు సంబంధించిన పాత కాంట్రాక్టర్లు తప్పుకున్నారు. పనులు జరుగుతుంటే రన్నింగ్‌ బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశారు. అలాగే కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ సమయం కూడా ముగిసింది.  
– నటరాజ్, డీఈ, పర్యాటక శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement