వివాదంలో కేకే కుమార్తె విజయలక్ష్మి

Shaikpet MRO Police Complaint On KK Daughter Vijayalakshmi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమెపై షేక్‌పేట్‌ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి తనపై దాడి చేసిందంటూ బుధవారం నాటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతో పాటు అనుచరులు షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను దుర్భాషలాడడమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుతుండగా అడ్డుకుని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను ఎంపీ కేశవరావు కూతుర్ని అంటూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనివాస్‌ రెడ్డి ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్‌ పీఠం ఈసారి మహిళకు రిజర్వు కావడంతో ఆమె హైదరాబాద్‌ మేయర్‌ అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలో ఆమె వివాదంలో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే దీనిపై విజయలక్ష్మీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top