వాటర్‌ రీసైక్లింగ్‌కు వేళయింది.. | Sewage water itself tomorrow fresh water with recycling | Sakshi
Sakshi News home page

వాటర్‌ రీసైక్లింగ్‌కు వేళయింది..

Jun 8 2026 5:25 AM | Updated on Jun 8 2026 5:25 AM

Sewage water itself tomorrow fresh water with recycling

మురుగునీరే రేపటి మంచి నీరు 

ఏడాదికి తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్‌ మీటర్లు 

1,486 క్యూబిక్‌ మీటర్లకు పడిపోయి ప్రమాదగీతను దాటిన భారత్‌ 

శుద్ధి చేసిన నీటికి మురుగునీరు అనే ముద్రతో వాడటానికి వెనుకంజ 

వ్యవసాయానికి వాడుకుంటే పంటలకు మేలు

సాక్షి, స్పెషల్‌డెస్క్‌: భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ‘నీటి సంక్షోభం’. భూగర్భ జలాలు పడిపోవడం, జనాభా పెరుగుదల వల్ల నీటిఎద్దడి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడగలిగే ఏకైక అస్త్రం ‘వాటర్‌ రీసైక్లింగ్‌’(మురుగునీటి శుద్ధి). నీటిని అత్యంత విలువైన వస్తువుగా భావించి బాధ్యతగా వాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం..ఏడాదికి తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్‌ మీటర్ల కంటే తగ్గితే ఆ దేశం నీటి ఒత్తిడి (వాటర్‌ స్ట్రెస్‌)లో ఉన్నట్లు లెక్క. 2021 నాటికే భారత్‌లో ఇది 1,486 క్యూబిక్‌ మీటర్లకు పడిపోయింది. అంటే మనం ఎప్పుడో ప్రమాద గీతను దాటేశాం. మరోవైపు 2031 నాటికి ఇది 1,367 క్యూబిక్‌ మీటర్లకు పడిపోనుంది. ఇది కనుక 1,000 క్యూబిక్‌ మీటర్ల కంటే తగ్గితే దేశం ‘తీవ్ర నీటి కొరత’లోకి వెళ్లిపోతుంది. 

సరైన లెక్కలు లేక.. 
సీఈఈడబ్ల్యూ (కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌) అధ్యయనం ప్రకారం పలు ప్రధాన లోపాలను ప్రస్తావించింది. మున్సిపాలిటీల వద్ద ఎంత మురుగునీరు ఉత్పత్తి అవుతోంది? ఎంత శుద్ధి చేస్తున్నారనే సరైన లెక్కలు లేవని, శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, వ్యవసాయానికి వాడటం చాలా తక్కువగా ఉందని, మెజారిటీ నీరు వృథా అవుతోందని తెలిపింది. ‘మురుగునీరు’అనే ముద్ర ఉండడం వల్ల ప్రజలు దీనిని వాడటానికి వెనుకాడుతున్నారని పేర్కొంది. 

రీసైక్లింగ్‌ నీటితో ప్రయోజనాలు 
వర్షాలు పడకపోయినా నగరాల నుంచి ప్రతిరోజూ మిలియన్ల లీటర్ల మురుగునీరు వస్తోంది. దీనిని శుద్ధి చేసి ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాలు, పార్కులకు మంచినీటికి బదులు వాడాలి. దేశంలో 80 శాతానికి పైగా నీరు వ్యవసాయానికే ఖర్చవుతుంది. శుద్ధి చేసిన నీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు ఉండటం వల్ల పంటలకు మేలు జరుగుతుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. 

ఆదర్శ నగరాలు ఇవే 
సింగపూర్‌ దేశం తన అవసరాల్లో 40 శాతం పైగా రీసైకిల్‌ నీటితోనే తీర్చుకుంటోంది. భారత్‌లోనూ కొన్ని నగరాలు ఈ బాటలో ఉన్నాయి. చెన్నైలో వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని చట్టబద్ధం చేసి, 10 శాతం కంటే ఎక్కువ మురుగునీటిని శుద్ధి చేసి భారీ పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. ఇక సూరత్‌లో అయితే శుద్ధి చేసిన నీటిని టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు విక్రయించడం ద్వారా మున్సిపాలిటీకి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. బెంగళూరులో మురుగునీటిని మూడో దశ వరకు శుద్ధి చేసి, 55 కి.మీ. దూరంలో ఉన్న కరువు ప్రాంతాల చెరువులను నింపుతున్నారు. దీనివల్ల అక్కడ భూగర్భ జలాలు పెరిగాయి.
 
చేయాల్సింది ఏంటి? 
భారత్‌లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిలో కేవలం 30 శాతంలోపే శుద్ధి అవుతోంది. మిగతాదంతా నదులను కలుషితం చేస్తోంది. ఇకపై వర్షాలు, భూగర్భ జలాలపైనే ఆధారపడటం సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్కువ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను (ఎస్టీపీలు) నిర్మించి, వ్యర్థ జలాలను వాడుకోవడమే దేశ భవిష్యత్‌కు ఏకైక మార్గం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement