హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదు.. సరూర్‌నగర్‌ పరువుహత్యపై స్పందించిన ఒవైసీ

Saroornagar Honour Killing: Asaduddin Owaisi Condemn Murderers Act - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలోనే కాదు.. యావత్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్‌నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. 

హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది సరైన చర్యే. కానీ,  సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎక్కడిది? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం క్రూరమైన చర్య, ఇస్లాం ప్రకారం దారుణమైన నేరం కూడా.   

సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని.. తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని అన్నారు ఆయన. 

ఖార్గోన్‌(మధ్యప్రదేశ్‌), జహంగీర్‌పురి(ఢిల్లీ) మత ఘర్షణలపైనా స్పందిస్తూ.. ఇకపై ఏ మతానికి సంబంధించి ఉరేగింపులు జరిగినా మసీదులపై హైరెజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఉరేగింపులు జరిగేటప్పుడు లైవ్‌ టెలికాస్టింగ్‌ చేయాలని,  అప్పుడు రాళ్లు రువ్వేది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ... సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని వాళ్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చదవండి: కాపాడమని కాళ్లు పట్టుకున్నాను, ఎవరూ ముందుకు రాలేదు-అశ్రిన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top