ఆంధ్రాకు టీఎస్‌ ఆర్టీసీ కొత్త రూట్లు

RTC Proposals For New Routes from Adilabad to Andhra Pradesh - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆంధ్రా ప్రాంతానికి ప్రస్తుతం నడుస్తున్న బస్సు సర్వీసుల ద్వారా ఆదాయం మెరుగ్గా వస్తుండడంతో తాజాగా ఆర్టీసీ ఆదిలాబాద్‌ రీజియన్‌ నుంచి అక్కడికి కొత్త రూట్ల కోసం ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వివిధ డిపోల నుంచి పది బస్సులు నడుస్తుండగా మరిన్ని పెంచడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇటీవల హైదరాబాద్, కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ పీవీ మునిశేఖర్‌ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ ప్రతిపాదనలు రూపొందించి పంపించాలని ఆదేశించారు.

దానికి అనుగుణంగా రీజియన్‌లో మంచిర్యాల నుంచి ఏలూరు, భైంసా నుంచి ఒంగోలు, నిర్మల్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని వింజామూర్, నిర్మల్‌ నుంచే నెల్లూరుకు  బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు చేశారు. వీటికి అంగీకారం లభిస్తే ఆ రూట్లలో బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ నుంచి గుంటూరు‌కు నాలుగు సర్వీసులు, ఆసిఫాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని పామూరుకు, నిర్మల్‌ నుంచి ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని ఉదయగిరి, కందుకూరు, పామూరు నాలుగు సర్వీసులు, భైంసా నుంచి గుంటూరుకు ఒక సర్వీసు నడుస్తోంది. ప్రధానంగా మన ప్రాంతంలో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భవన నిర్మాణ మేస్రీలు, కూలీలు ఈ రూట్లలో నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతోనే ఈ బస్సు సర్వీసులకు రద్దీ ఉంది. 

బస్సుల సర్వీసుల సంఖ్య పెంపు
కరోనా ప్రభావం నుంచి ఆర్టీసీ క్రమంగా తేరుకుంటోంది. తిరిగి ప్రయాణికుల శాతం (ఓఆర్‌) పెరుగుతుండటంతో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో హర్షం వ్యక్తం అవుతోంది. కరోనాకు ముందు ప్రతీరోజు రీజియన్‌లో 600 బస్సులు నడిచేవి. అందులో ఆర్టీసీ 349, అద్దె బస్సులు 251 ఉండగా నిత్యం 2.58 లక్షల కిలో మీటర్లు ప్రయాణించి లక్షా 15 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. తద్వారా రూ. 85 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఆదాయం లభించేది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 23 నుంచి మే 18 వరకు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సంస్థకు తీవ్ర నష్టం సంభవించింది. మే 19న బస్సులను పునః ప్రారంభించినా ప్రయాణికుల శాతం అంతంత మాత్రమే ఉంది. దానికి అనుగుణంగా బస్సు సర్వీసు సంఖ్యను పెంచుతూ వచ్చారు. మొదట 35 శాతం వరకు రాగా క్రమక్రమంగా పెరుగుతూ ఈ మధ్య వరకు 55 శాతం వరకు వచ్చింది. తాజాగా ఓఆర్‌ శాతం 69కి చేరుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఆర్టీసీలో రద్దీ పెరిగింది. గురువారం వరకు 520 బస్సు సర్వీసుల 2.20 లక్షల కిలోమీటర్ల మేర తిప్పగా, 60 వేల నుంచి 65 వేల వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. శుక్రవారం నుంచి మరో 40 సర్వీసుల సంఖ్యను పెంచి మొత్తం 560 బస్సులను నడుపుతున్నారు. ప్రస్తుతం రూ.75 లక్షల వరకు ఆదాయం లభిస్తుండగా పెరిగిన సర్వీసులకు అనుగుణంగా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

పెంచే అవకాశం
ఆంధ్రా ప్రాంతానికి బస్సు సర్వీసుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రీజియన్‌ పరిధిలో ఓఆర్‌తో పాటు ఆదాయం పెరిగిన దృష్ట్యా మరిన్ని బస్సు సర్వీసుల సంఖ్యను పెంచుతున్నాం. క్రమ క్రమంగా రీజియన్‌లోని 600 బస్సులను తిప్పే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. – రమేశ్, డీవీఎం, ఆదిలాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top