breaking news
Bus Routes
-
బస్సు రూటు మార్పుపై మహిళల ధర్నా
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరులో బకింగ్‌హాం కాలువపై వంతెన పనులు పూర్తికావడంతో ప్యారిస్, మనలి మధ్య నడిచే నెంబర్ 56 బస్సు రూట్ మార్పు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మహిళలు ఆందోళన చేపట్టారు. చైన్నె, తిరువొత్తియూరు బకింగ్ హామ్ కాలువను అనుకుని ఉన్న రోడ్డులో ఐదేళ్లుగా ప్రభుత్వ బస్సు 56ఈ నడుస్తోంది. రాజాజీ నగర్, కార్గిల్ నగర్, వెట్రి వినాయక నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ బస్సును ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బకింగ్ హామ్ కాలువపై చేపట్టిన వంతెన పనులు పూర్తయి దానిని ప్రారంభించారు. దీంతో బకింగ్ హామ్ కాలువ మార్గంగా వెళుతున్న బస్సులను పాత మార్గంలోని వంతెనపై నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కార్గిల్ నగర్ మార్గంలోనే బస్సును నడపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 50 మందికి పైగా మహిళలు కొత్త వంతెన వద్ద రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తిరువొత్తియూరు పోలీసులు అక్కడికి చేరుకొని వారితో చర్చించారు. ఉన్నతాధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఆంధ్రాకు టీఎస్ ఆర్టీసీ కొత్త రూట్లు
సాక్షి, ఆదిలాబాద్: ఆంధ్రా ప్రాంతానికి ప్రస్తుతం నడుస్తున్న బస్సు సర్వీసుల ద్వారా ఆదాయం మెరుగ్గా వస్తుండడంతో తాజాగా ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ నుంచి అక్కడికి కొత్త రూట్ల కోసం ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ డిపోల నుంచి పది బస్సులు నడుస్తుండగా మరిన్ని పెంచడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇటీవల హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పీవీ మునిశేఖర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ప్రతిపాదనలు రూపొందించి పంపించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా రీజియన్‌లో మంచిర్యాల నుంచి ఏలూరు, భైంసా నుంచి ఒంగోలు, నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాలోని వింజామూర్, నిర్మల్ నుంచే నెల్లూరుకు బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు చేశారు. వీటికి అంగీకారం లభిస్తే ఆ రూట్లలో బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి గుంటూరుకు నాలుగు సర్వీసులు, ఆసిఫాబాద్ నుంచి ప్రకాశం జిల్లాలోని పామూరుకు, నిర్మల్ నుంచి ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని ఉదయగిరి, కందుకూరు, పామూరు నాలుగు సర్వీసులు, భైంసా నుంచి గుంటూరుకు ఒక సర్వీసు నడుస్తోంది. ప్రధానంగా మన ప్రాంతంలో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భవన నిర్మాణ మేస్రీలు, కూలీలు ఈ రూట్లలో నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతోనే ఈ బస్సు సర్వీసులకు రద్దీ ఉంది. బస్సుల సర్వీసుల సంఖ్య పెంపు కరోనా ప్రభావం నుంచి ఆర్టీసీ క్రమంగా తేరుకుంటోంది. తిరిగి ప్రయాణికుల శాతం (ఓఆర్) పెరుగుతుండటంతో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో హర్షం వ్యక్తం అవుతోంది. కరోనాకు ముందు ప్రతీరోజు రీజియన్‌లో 600 బస్సులు నడిచేవి. అందులో ఆర్టీసీ 349, అద్దె బస్సులు 251 ఉండగా నిత్యం 2.58 లక్షల కిలో మీటర్లు ప్రయాణించి లక్షా 15 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. తద్వారా రూ. 85 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఆదాయం లభించేది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 23 నుంచి మే 18 వరకు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సంస్థకు తీవ్ర నష్టం సంభవించింది. మే 19న బస్సులను పునః ప్రారంభించినా ప్రయాణికుల శాతం అంతంత మాత్రమే ఉంది. దానికి అనుగుణంగా బస్సు సర్వీసు సంఖ్యను పెంచుతూ వచ్చారు. మొదట 35 శాతం వరకు రాగా క్రమక్రమంగా పెరుగుతూ ఈ మధ్య వరకు 55 శాతం వరకు వచ్చింది. తాజాగా ఓఆర్ శాతం 69కి చేరుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆర్టీసీలో రద్దీ పెరిగింది. గురువారం వరకు 520 బస్సు సర్వీసుల 2.20 లక్షల కిలోమీటర్ల మేర తిప్పగా, 60 వేల నుంచి 65 వేల వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. శుక్రవారం నుంచి మరో 40 సర్వీసుల సంఖ్యను పెంచి మొత్తం 560 బస్సులను నడుపుతున్నారు. ప్రస్తుతం రూ.75 లక్షల వరకు ఆదాయం లభిస్తుండగా పెరిగిన సర్వీసులకు అనుగుణంగా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. పెంచే అవకాశం ఆంధ్రా ప్రాంతానికి బస్సు సర్వీసుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రీజియన్ పరిధిలో ఓఆర్‌తో పాటు ఆదాయం పెరిగిన దృష్ట్యా మరిన్ని బస్సు సర్వీసుల సంఖ్యను పెంచుతున్నాం. క్రమ క్రమంగా రీజియన్‌లోని 600 బస్సులను తిప్పే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. – రమేశ్, డీవీఎం, ఆదిలాబాద్ -
బస్సు రూట్లలో మార్పులు
కొన్నింటి విస్తరణ డీటీసీ ప్రకటన న్యూఢిల్లీ: మరిన్ని ప్రాంతాలకు బస్సు సేవలను విస్తరించి, ప్రయాణికులకు సౌకర్యభరిత ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తన బస్సు రూట్లలో మార్పులు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గాల్లో బస్సుల సేవలను పొడగించింది. ప్రస్తుతం రూటు నంబర్ 102 ఎస్టీఎల్లో ఇందర్ ఎన్క్లేవ్ నుంచి మధుభన్ చౌక్ వరకు నడుస్తున్న బస్సులు ఇక నుంచి రోహిణి సెక్టార్ 21 లఖీరామ్ పార్కు-మధుబన్ చౌక్ మార్గంలో సేవలు అందిస్తాయి. ఈ మార్గం లో బస్సులు మధుబన్ చౌక్, రోహిణి సెక్టార్ 7/8 క్రాసింగ్, రోహిణి డిపో, నల్లా గ్యాస్‌ప్లాంట్, రోహిణి సెక్టార్ 24/25 క్రాసింగ్, రోహిణి సెక్టార్-23, 100 ఫూటా రోడ్డు డీడీఏ పార్కు, రోహిణి సెక్టార్ - 22 లఖీరామ్ పార్కు, ఇందర్ ఎన్క్లేవ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని డీటీసీ అధికార ప్రతినిధి ఆర్ ఎస్ మిన్హాస్ గురువారం ప్రకటించారు. ఇక 854 నంబరు రూట్లో ప్రయాణించే బస్సులు ప్రస్తుతం సరాయికలే ఖాన్ అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ (ఐఎస్బీటీ), ఉత్తమ్‌నగర్ టెర్మినల్ వరకు నడుస్తున్నాయి. ఇవి ఇక మీదట జనక్‌పురి సీ-2బీ, తిలక్‌నగర్ నుంచి జిల్లా పార్కు మీదుగా జనక్‌పురి బి-1కు చేరుకుంటాయి. రాత్రిపూట నంబరు 0901 మార్గంలో తిరిగే బస్సురూటు కూడా మారింది. ప్రస్తుతం ఇవి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గేటు 2 నుంచి మంగోల్‌పురి వరకు వెళ్తుం డగా, ఇక నుంచి రోహిణి సెక్టార్-22 టెర్మినల్ వరకు వెళ్తాయి. ఢిల్లీగేటు, ఎర్రకోట, కాశ్మీరీగేట్ ఐఎస్బీటీ, పాత సచివాలయం, జీటీబీ నగర్, అశోక్ విహార్ క్రాసింగ్, రోహిణి సెక్టార్ 20/21 ప్యాకెట్-9 మీదుగా రోహిణి సెక్టార్ 22 టెర్మినల్ వరకు వెళ్తాయి.