నర్సంపేట ఆర్టీసీ డిపో గేట్ వద్ద గురువారం రాత్రి ధర్నా చేస్తున్న కార్మికులు, శంకర్‌గౌడ్ (ఫైల్)
నర్సంపేట డిపో వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్‌గౌడ్
తీవ్రగాయాలతో వరంగల్ ఎంజీఎంకు తరలింపు
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు.. 80% కాలిన గాయాలు.. పరిస్థితి విషమం
నల్లగొండలో మరో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
నర్సంపేట/కాశిబుగ్గ/హనుమకొండ: వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడుపుతుండటాన్ని నిరసిస్తూ శంకర్‌గౌడ్ ఒంటికి నిప్పంటించుకున్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ బస్టాండ్ వద్ద రాస్తారోకోకు దిగారు.
ఉదయం సివిల్ డ్రెస్‌లో..
శంకర్‌గౌడ్ ఉదయం సివిల్ డ్రెస్‌లో వచ్చి కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లి ఆర్టీసీ యూనిఫాం ధరించి తిరిగి బస్టాండ్ ప్రాంగణానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తోటి కార్మీకులతో మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మనం ఆందోళన చేస్తుంటే ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లను నియమించుకుని సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్‌ను మీద పోసుకుని నిప్పు అంటించుకున్నట్లు కార్మీకులు తెలిపారు. నర్సంపేట డిపో వద్ద ప్రైవేటు బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లకుండా, బస్టాండ్ లోపల ఉన్న ప్రైవేటు బస్సులు బయటకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు రాత్రి వరకు గేటు వద్ద ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. శంకర్‌గౌడ్ స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపురం కాగా, 30 ఏళ్లుగా నర్సంపేటలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కూతురు బూర శ్యామిలి ప్రభుత్వాన్ని వేడుకుంది. శంకర్‌గౌడ్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మంత్రి పొన్నం పరామర్శ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన పరిస్థితి గురించి వైద్యు లతో మాట్లాడారు. శంకర్‌గౌడ్ పరిస్థితి విషమంగా ఉందని పొన్నం మీడియాకు చెప్పారు.
అండగా ఉంటాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న కేటీఆర్.. శంకర్ గౌడ్ అల్లుడు బూర సుమన్‌తో హైదరాబాద్ నుంచి ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. శంకర్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు.
నేడు ఉమ్మడి జిల్లా బంద్ : ఆర్టీసీ జేఏసీ పిలుపు
శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ వైఖరి మూలంగానే డ్రైవర్ శంకర్ ఆత్మహత్యకు యత్నించినట్లు జేఏసీ తెలిపింది.
నల్లగొండలో మరొకరు..
రామగిరి (నల్లగొండ): ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన రావుల వెంకన్న నల్లగొండలో నివాసం ఉంటూ మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం నల్లగొండ డిపోలో కార్మీకుల ధర్నాకు హాజరయ్యాడు. ఉద్యోగులందరూ ఒకచోట చేరి సమస్యలపై చర్చించుకుంటుండగా ఉద్వేగానికి లోనైన వెంకన్న.. తనవెంట బాటిల్‌లో తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న ఉద్యోగులు, పోలీసులు గమనించి అడ్డుకుని వెంకన్నను ఇంటికి పంపించారు.


