గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులపై చార్జీల మోత | RTC bus fares hiked in Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులపై చార్జీల మోత

Oct 6 2025 7:48 AM | Updated on Oct 6 2025 9:37 AM

RTC bus fares hiked in Hyderabad

గ్రేటర్‌లో పెరిగిన ఆర్టీసీ చార్జీల అమలు నేటి నుంచే 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అదనపు చార్జీల వల్ల ప్రయాణికులపై ప్రతి నెలా దాదాపు రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజు సుమారు రూ.2.5 కోట్లు టికెట్లపై నగదు రూపంలో లభిస్తుండగా, మరో రూ.4 కోట్ల వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు అందజేసే ఉచిత ప్రయాణ సదుపాయం నుంచి రీయింబర్స్‌మెంట్‌ ఆర్టీసీ ఖాతాలో జమ అవుతున్నాయి. మొత్తంగా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ప్రతిరోజూ రూ.6.5 కోట్లు లభిస్తున్నాయి. పెంచిన చార్జీలు రోజుకు రూ.50 లక్షల చొప్పున నెలకు రూ.15 కోట్ల వరకు ఆదాయం లభించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ లెక్కల ప్రకారం నగరంలో నిత్యం సుమారు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 16 లక్షలకు పైగా మహిళా ప్రయాణికులు. 9 లక్షల మంది పురుషులు ప్రయాణిస్తున్నారు.  

దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సులు.. 
నగరంలోని 25 డిపోల నుంచి 3,100 బస్సులు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 275 ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా  గ్రేటర్‌లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులను  ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్‌ బస్సులకు చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హైటెన్షన్‌ కనెక్షన్‌ల కోసం రూ.8 కోట్ల వరకు ఖర్చవుతోంది. రానున్న  రోజుల్లో 2,800  కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటును లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం టికెట్‌ చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు.  

నిర్వహణ ఖర్చులే అధికం.. 
గ్రేటర్‌ ఆర్టీసీకి రోజుకు రూ.6.5 కోట్లు లభిస్తున్నప్పటికీ నిర్వహణ వ్యయం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం  గ్రేటర్‌లోని  25 డిపోల్లో సుమారు 1,5000 మంది పని చేస్తున్నారు. వీరిలో 7,000 మంది కండక్టర్లు. 5,700 మంది డ్రైవర్లు. మిగతా వారిలో మెకానిక్‌లు, శ్రామిక్‌లు మొదలుకొని డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీకి లభించే  ఆదాయంలో సుమారు  50 శాతం సిబ్బంది జీతభత్యాలకే ఖర్చవుతోంది. మరో  25 శాతం ఇంధనం కోసం విని యోగిస్తుండగా, వివిధ అవసరాల కోసం మిగతా మొత్తాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం  ఎలాంటి లాభనష్టాల్లేకుండా బస్సులను నడపడమే ఆర్టీసీకి సవాల్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా పెంచిన చార్జీలతో ప్రయాణికులకు భారమే అయినా ఆరీ్టసీకి మాత్రం కొంత ఊరటగా చెప్పవచ్చు.  

చార్జీల పెంపు మచ్చుకు ఇలా..  
సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్, ఈ–ఆర్డినరీ, ఈ–ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5 చొప్పున పెంపు. 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు చార్జీ.  

మెట్రో డీలక్స్, ఈ– మెట్రో ఏసీ సరీ్వసుల్లో మొదటి స్టేజీకి రూ.5 చొప్పున పెంచారు.  రెండో స్టేజీ నుంచి రూ.10 చొప్పున పెంపు.  

ఈ లెక్కన ప్రస్తుతం రూ.20 చెల్లించి ప్రయాణం చేసేవారు ఇక నుంచి రూ.30 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈసీఐఎల్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ఇప్పటి వరకు రూ.30 ఉండగా, సోమవారం నుంచి రూ.40 చొప్పున చార్జీ ఉంటుంది. 

 అలాగే.. మెహిదీపట్నం నుంచి 
సికింద్రాబాద్‌ వరకు రూ.25 నుంచి రూ.35 వరకు పెరగనుంది. మియాపూర్‌ –అమీర్‌పేట్‌ల మధ్య రూ.60 నుంచి రూ.70కి పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement