మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ..

Robbery In The Name Of Foreign Currency Medak, CC Tv Footage - Sakshi

సాక్షి, మెదక్‌: విదేశీ కరెన్సీ కావాలని ఓ కిరాణ షాపులో మోసానికి పాల్పడిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. నర్సాపూర్‌ చౌరస్తా వద్ద ఉన్న సాయి భైరవ కిరాణం దుకాణానికి శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విదేశీ కరెన్సీ కావాలా? అంటూ కౌంటర్‌పై కూర్చున్న శ్రీతేజతోపాటు షాపులో పని చేస్తున్న సయ్యద్, సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డిలను మాటల్లో పెట్టారు.

ఈ క్రమంలో కౌంటర్‌లోని రూ.30 వేలతోపాటు మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకొని మోసగాళ్లు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ముందుగా దుకాణంలోకి వచ్చి మా దగ్గరున్న విదేశీ కరెన్సీ తీసుకొని ఇక్కడి డబ్బు ఇవ్వాలని కోరుతూ మాటల్లో పెట్టారు. కౌంటర్‌లోని డబ్బుతోపాటు కిరాణ సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకున్న సమయంలో తమకు జరిగిన సంఘటన గుర్తులేకుండా పోయిందని బాధితులు వాపోయారు.

ఆ ముగ్గురు మోసగాళ్లు నార్త్‌సైడ్‌ అధికారులుగా మంచి దుస్తులు వేసుకొని కారులో వచ్చినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి కిరాణం కౌంటర్‌లో కూర్చున్న శ్రీతేజ తండ్రి ప్రభుశంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై నర్సాపూర్‌ ఎస్‌ఐ గంగరాజును వివరణ కోరగా రవిశంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top